Sep 08,2023 19:56

తాగునీటిని నింపుకునేందుకు వేచి ఉన్న ప్రజలు

ప్రజాశక్తి - నందవరం
ఓ వైపు 50 వేల క్యూసెక్కులతో తుంగభద్ర నది ప్రవహిస్తున్నా మిట్టా సోమాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. నది నుంచి ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా రోజువారీగా తాగునీటిని సరఫరా చేస్తున్నా సర్పంచి, అధికార పార్టీ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు. అధికారులు, నాయకుల నిర్లక్ష్యంతో తాగునీటిని సరఫరా చేసే సిబ్బంది 'మోటార్లు చెడి పోయాయ'ని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మోటార్ల మరమ్మతులు అనే కారణంతో రెండు, మూడు రోజులకు ఒకసారి నీరందక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, ఎంపిపి నిధుల కింద తాగునీటి కోసం రూ.7 లక్షలు ఖర్చు చేశామని చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. సర్పంచి ఆ నిధులను ఏయే పనులకు ఖర్చు చేశారో చెప్పాలని కోరుతున్నారు. సర్పంచి, సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.