Sep 08,2023 21:06

డిఆర్‌ఒకు వినతినిస్తున్న సిపిఎం నాయకులు రెడ్డివేణు తదితరులు

ప్రజాశక్తి - బెలగాం :  జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లోని పలు కాలనీలను వరద ముంపు నుంచి కాపాడాలని, వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, కాలువలు, గట్లుపై ఏర్పడ్డ ఆక్రమణలను తొలగించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కు వినతిని అందజేసింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పార్వతీపురం పట్టణం జలమయమైందన్నారు. పట్టణంలో వరహాలగెడ్డ ప్రవహిస్తుందని, దీని నీరు వెళ్లేందుకు 40 అడుగుల వెడల్పు కాలువను బడా రాజకీయ నాయకులు పలుకుబడితో పెద్దలు ఆక్రమించుకోవడం ద్వారా పది అడుగుల వెడల్పుకి తగ్గిందన్నారు. దీంతో కాలువ ద్వారా నీరు వెళ్లలేక లోతట్టు ప్రాంతాలైన జనశక్తి కాలనీ, బైపాస్‌ కాలనీ, సౌందర్య థియేటర్‌, చైతన్య స్కూలు కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్‌ , ఎస్సీ హాస్టల్లోకి మూడు, నాలుగు అడుగుల లోతు నీరు చేరిందని, దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలువలు, చెరువుల ఆక్రమణకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగదేనని, కావున ఆక్రమణ తొలగించి నీటి మునిగిన వారికి పునరావాసం కల్పించి ప్రత్యామ్నాయ చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే సాలూరు పట్టణం చెరుకుపల్లి గెడ్డ నీటి వల్ల ఆర్‌టిసి కాంప్లెక్స్‌ చుట్టూ ఉన్న కాలనీలు నీటమనుగుతున్నాయన్నారు. ఈ గెడ్డ నీరు వచ్చే బంగారంపేట దగ్గర కాలువను ఆక్రమించడం, పూడ్చి వేయడంతో కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుందన్నారు. కావున వరద నీరు వెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూడికలు తీసి ఆక్రమణ తొలగించాలని డిమాండ్‌ చేశారు. పాలకొండ పట్టణంలో మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల నివాస ప్రాంతాల్లోకి మురుగునీరు వెళ్లడంతో వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. జిల్లాలో మూడు పట్టణాల్లోని కాలనీలో ముంపు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, వీటికి ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం రాసి డిఆర్‌ఒ జె.వెంకట్రావుకు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, పట్టణ కమిటీ సభ్యులు ఎస్‌.ఉమా, బంకురు సూరిబాబు, పి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.