ప్రజాశక్తి కొమరాడ : ప్రజలకు అవసరమైన పూర్ణపాడు-లాబేసు వంతెనను పూర్తి చేయాలని ఎపి గిరిజన పరిరక్షణ వేదిక కన్వీనర్ కోలక లక్షణమూర్తి డిమాండ్ చేశారు. 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలకు సాధన కమిటీకి మద్దతుగా ఎపి గిరిజన పరిరక్షణ వేదిక కన్వీనర్ కోలక లక్ష్మణ మూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్.విశ్వేశ్వరరావు, కళింగ వైశ్య జిల్లా అధ్యక్షులు వడ్డి గాంధీ మద్దతుగా తెలిపారు. అనంతరం లక్ష్మణమూర్తి మాట్లాడుతూ మండలంలో 31 పంచాయతీలకు సంబంధించి అందులో 9 పంచాయతీలకు అతిముఖ్యమైన పూర్ణపాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు పూర్తిచేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 2006లో శంకుస్థాపన చేసినా నేటికీ వంతెన పూర్తి కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమేనని అన్నారు. ప్రజా ప్రతినిధులు పదవులకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ స్పందించి వంతెన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలో సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, పకీరు శంకర్రావు, లక్ష్మణరావు, పోలి నాయుడు, పలువురు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.










