ప్రజాశక్తి - కొమరాడ : దీర్ఘకాలంగా గిరిజనులు ఎదురుచూస్తున్న పూర్ణపాడు-లాబేసు వంతెన అవసరం ఎంతైనా ఉందని, కావున వెంటనే పనులు పూర్తి చేయాలని వంతెన సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తిచేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యంలో కోమట్లపేట వద్ద రెండో రోజు శుక్రవారం అర్ధనగంగా మోకాళ్లపై నిల్చొని, భారీ వర్షం మధ్య గొడుగులు వేసుకొని దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జనసేన మండల నాయకులు శ్రీకర్ దీక్షలకు మద్దతు తెలిపారు. అనంతరం సాధన కమిటీ సభ్యులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా వెంటనే వంతెన పనులు పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ గతంలో అనేక సందర్భాల్లో సిపిఎం ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళనలు చేశామన్నారు. జనవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కాంట్రాక్టర్‌కు నిధులు చెల్లించకపోవడంతో ఆయన వెళ్లిపోవడం అన్యాయమన్నారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయించి, వంతెన పెండింగ్ పనులు పూర్తిచేసి 60 గిరిజన గ్రామాల ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలకు స్పందించకపోతే ఈనెల 28న స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామన్నారు. రిలే నిరాహార దీక్షల్లో, ధర్నాలో ప్రజలంతా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు శివు న్నాయుడు, వెంకటేశు, అప్పారావు, పోలినాయుడు, గౌరి, గణపతి, సింహాచలం, అప్పారావు, రాయుడు, సరోజినమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.










