అనంతపురం కలెక్టరేట్ : ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించి జిల్లాలో వంద శాతం ఓటర్ల పున్ణపరిశీలన పూర్తి చేశామని కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం స్పెషల్ సమ్మర్ రివిజన్ - 2024, ఇంటింటి సర్వేపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్‌ఒ గాయత్రీ దేవి, ఈఆర్‌ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 96,153 ఓటరు తొలగింపులు అన్నింటినీ పున్ణపరిశీలన చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని పూర్తి చేసినట్లు వివరించారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పున్ణపరిశీలన చేపట్టామన్నారు. ఇంటింటి పరిశీలనలో వచ్చిన ఫాం-6,7,8 క్లెయిమ్స్ ఈనెల 15వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. నూతన ఓటర్ల నమోదుకు సంబంధించి పరిశీలన కార్యక్రమం 15 రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జిల్లాలో మొదలు పెట్టామని, ఇందులో గుర్తించిన సమస్యలను ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించి పరిష్కరిస్తామన్నారు. ఈనెల 19వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, రవీంద్ర, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఈఆర్‌ఓ వెంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రమణారెడ్డి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ కనకరాజు పాల్గొన్నారు.










