ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల పరిధిలోని నక్కలగుట్ట లేఅవుట్ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. అర్హులైన పేదలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సర్పంచి గంగాదేవి నరసింహామూర్తి, నాగినేని చెరువు సర్పంచి అంజి నాయక్, వైస్ ఎంపిపి వెంకటనారాయణ రెడ్డి వైసీపీ నాయకులు ఎల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు లబ్ధిదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నక్కలగుట్ట స్థలాల్లో అనర్హులకు స్థలాల కేటాయించారని విమర్శించారు. పట్టాలు పొందిన అర్హులకు అధికారులు స్థలాలు చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండ సిఐ కరుణాకర్, స్థానిక ఎస్‌ఐ విజరు కుమార్, తహశీల్దార్ సురేష్ కుమార్ నాయకులతో మాట్లాడారు. లేఅవుట్ స్థలాలను సర్వే చేయించి రెండు రోజుల్లో అర్హులకు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.










