Jun 07,2023 22:21

ఫ్లెక్సీని తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

ప్రజాశక్తి బత్తలపల్లి : బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం రాత్రి వైసిపి నాయకుడు ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీని సిఐ,మన్సురుద్దీన్‌, ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష సామరస్య పూర్వకంగా తొలగింప చేయించారు. బుధవారం పలువురు టిడిపి నేతలు బత్తలపల్లి పోలీసుల దృష్టికి వైసిపి నాయకుడు ఏర్పాటు చేసిన వివాదాస్పద ప్లెక్సీ విషయాన్నితీసుకువెళ్లారు. రాష్ట్రంలోని పలుచోట్ల వైసిపి నాయకులు ఏర్పాటుచేసిన 'పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం, పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వైసిపి, టిడిపి,జనసేన పార్టీల నడుమ ఫ్లెక్సీల వివాదం ఘర్షణలకు దారి తీసిన విషయం తెలిసిందే. కూడలిలో ప్లెక్సీ వెలసిన వెంటనే టిడిపి నేతలు స్పందించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. టిడిపి మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, జక్కంపూడి నాగభూషణ, జొన్నలగడ్డ రంగనాయుడు, తాళ్లూరు సతీష్‌ కుమార్‌ చౌదరి, ఎం.చెర్లోపల్లి చౌదరి, నెట్టెం శ్రీనివాస్‌,రామాపురం కేశవ,నెట్టెం రమణ, సదాశివ, నాగార్జునరెడ్డి,జనసేన నాయకులు పూల రవి,గొట్లూరు రామాంజనేయులు తదితరులు పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెను వెంటనే వైసిపి నాయకుడు కోటి సూర్యప్రకాష్‌ బాబుతో ఫోన్లో మాట్లాడారు. పంచాయతీ సిబ్బందిచే వివాదాస్పద ఫ్లెక్సీ తొలగింప చేయించారు. అనంతరం ఏపీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం కూడా వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూచించిందని, ఈ విషయం తనకు తెలియక ఫ్లెక్సీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్లెక్సీ తొలగింపునకు సహకరించినట్లు తెలిపారు.