విత్తనాలు, ఎరువుల ధరలు తగ్గించండి
- రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు
- ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని, మాటల్లో రైతుల అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడడం తప్ప ఆచరణలో శూన్యమని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాలలోని టి.నర్సింహయ్య భవన్‌లో ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు టి.రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఖరీఫ్ సాగులో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలపైన ప్రభుత్వాలు కఠినంగా వ్యవహారించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అంటూ రోజు రోజుకు రైతుల ఆదాయం పూర్తిగా తగ్గిపోతుందని, పెట్టుబడి మాత్రం రెట్టింపు అవుతుందని అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడం, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో ఖర్చులు పెరగడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు. రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటనల్లో చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి ఢిల్లీ నడి వీధుల్లో మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతాంగం ఆందోళన చేస్తుంటే హామీ ఇచ్చిన ప్రధానమంత్రి ఈనాటికి హామీ ఏ మాత్రం అమలు చేయలేదన్నారు. దేశంలో సుమారు 100 కోట్ల ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే వారి ఉత్పత్తులకు రేటు నిర్ణయించుకునే అధికారం వారికి లేకుండా చేశారని అన్నారు. గతంలో ఎన్నికల కంటే ముందు ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ రైతుల అప్పులను, పెట్టుబడిని మాత్రం రెట్టింపు చేశారన్నారు. కేవలం కార్పొరేట్ శక్తుల ఆదాయాలు రెట్టింపు చేసేందుకు పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తూ విద్యుత్ మోటార్ల వద్ద మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం వల్ల లక్షలాది ఎకరాల్లో రైతులకు నష్టం జరుగుతున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కావున రైతులందరూ ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. రైతాంగానికి అవసరమైన పంట రుణాలను సకాలంలో బ్యాంకుల ద్వారా ఇవ్వాలని, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణపరిమితులను పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు పెంచి ఇచ్చి వడ్డీ వ్యాపారుల వారి నుండి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తీవ్రమైన రుణ భారంతో కుంగిపోతున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వైతాంగానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వాలే అందజేయాలని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో దశల వారి రైతు ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్, సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు సురేష్, సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కె.ప్రభాకర్ రెడ్డి










