విత్తనాలు ఆర్‌బికెల ద్వారా ఇవ్వాలి
- కలెక్టర్‌కు రైతు సంఘం నాయకులు వినతి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన మొక్కజొన్న, పత్తి, వరి విత్తనాలను రైతు భరోసా కేంద్రాల సరఫరా చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. బుధవారం ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శులు టి. రామచంద్రుడు, సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు తదితరుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారులు రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే కేవలం జీలుగ విత్తనాలను మాత్రమే ఇస్తున్నారని, మహానంది వ్యవసాయ ఫారం ద్వారా వరి విత్తనాలు కొంత మందికి మాత్రమే సరఫరా చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులందరూ మొక్కజొన్న, పత్తి విత్తనాల కోసం, నంద్యాల, కర్నూల్ సోనా వరి విత్తనాల కోసం వివిధ రకాల ప్రైవేట్ సీడ్ కంపెనీల షాపుల చుట్టూ తిరుగుతూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు నకిలీ, నాణ్యమైన ఏవో అర్థంకాని అయోమయంలో రైతాంగం ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం జిల్లా వ్యవసాయ అధికారులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన, అవసరమైన మొక్కజొన్న, పత్తి, వరితో పాటు అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి కూడా సున్నా వడ్డీ డబ్బులు జమ కావడం లేదని తెలిపారు. పావలా వడ్డీ రుణ పరిమితి పెంచి ఇవ్వాలని కోరారు. అకాల వర్షాలు, అధిక వర్షాలతో ఉద్యానవన, వాణిజ్య పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలన్నారు. రెండు సంవత్సరాల నుండి నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయి కోర్టుల్లో కేసులు నడుస్తున్న రైతాంగానికి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్నారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బిసి ప్రాజెక్టుల కింద అసంపూర్తిగా ఉన్న పంట కాలువలను పూర్తి చేయాలని, సోలార్ పరిశ్రమ వల్ల భూములు కోల్పోయిన పిన్నాపురం గ్రామ రైతు కూలీలకు నష్టపరిహారం చెల్లించడంలో 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలగనూరు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతికరణ చేపట్టాలని, కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 167కె జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయే రైతాంగానికి 2013 భూ సేకరణ చట్టం వర్తింపచేయాలని, భూ యజమాని అగ్రిమెంటుతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గ్రామసభ ఆధారంగా గుర్తింపు కార్డులను ఇచ్చి అన్ని ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపచేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.










