విత్తన కొరత లేదు
- జిల్లాకు 8,172 క్వింటాళ్ల విత్తనాలు
- అవసరమైన రైతులు ఆర్‌బికెల్లో తీసుకోవచ్చు
- జిల్లా వ్యవసాయ అధికారి టి. మోహన్ రావు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి జిల్లాలో ఎలాంటి విత్తన కొరత లేదని, జిల్లాకు 8,172 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, అవసరమైన రైతులు ఆర్‌బికెలకు వెళ్లి తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి టి.మోహన్ రావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి ఖరీఫ్-2023 సీజన్‌కు ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలను సరఫరా చేస్తుందన్నారు. కంది 500 క్వింటాళ్లు, మినుములు 85, పెసలు 18, కొర్రలు 16, వేరుశెనగ 3560, పచ్చి రొట్టే విత్తనాలు, జీలుగ 3993 క్వింటాలు జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. ఇది పూర్తిస్థాయిలో డి క్రిష్ యాప్ ద్వారా ఆర్‌బికెలో రైతులకు అందజేస్తున్నారని తెలిపారు. విత్తనాల సంబంధించిన లేదా విత్తన వ్యాపార దుకాణాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా రైతులు తక్షణమే 331057582 నంబర్‌కు తెలపాలని సూచించారు. ఎరువులు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఈ నెలలో జిల్లాకు 4300, యూరియా 3850 మెట్రిక్ టన్నులు, డిఎపి అవసరం కాగా ప్రస్తుతం యూరియా 15170, డిఏపి 14084, ఎన్‌పికె కాంప్లెక్స్ ఎరువులు 35065 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆర్‌బికెల ద్వారా 88,400 వేల మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్దేశించిన్నట్లు తెలిపారు.










