Sep 28,2023 21:13

మాట్లాడుతున్న గౌరీశ్వరరావు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : పిఎం విశ్వకర్మ పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు కొమ్మనాబిల్లి గౌరీశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలో వివిధ వర్గాల వారితో విశ్వకర్మ పథకం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి సాంప్రదాయ చేతివృత్తుల, కులవృత్తుల వారైన వండ్రంగి, స్వర్ణకార, కంచర, కుమ్మరి, భవన నిర్మాణ కార్మికులు, చేనేత, మంగలి, చెప్పులు కుట్టేవారు అర్హులన్నారు. ఈ పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణతో పాటు రూ.15వేలు విలువచేసే సామగ్రి పంపిణీ చేస్తారని, అవసరమైన అర్హులకు రెండు విడతల్లో రూ.3లక్షలు లోన్‌ పొందే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో విడతల వారీగా నమోదు ప్రక్రియ జరుగుతుందని, మరికొద్ది రోజుల్లో మన్యం జిల్లాలో నమోదు ప్రారంభం కాబోతుందన్నారు. ముందస్తుగా అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ఆర్ధికాభివృద్ధిని సాధించాలన్నారు. కార్యక్రమంలో కె.సత్యనారాయణ, ఎం.భద్రయ్య, కోదండ, నాగు, చిన్నారి, రామారావు, గ్రంథి సాయి, టైలర్లు, మేస్త్రులు పాల్గొన్నారు.