కలెక్టరేట్: ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య వారసులుగా గర్వించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ దినోత్సవం స్థానిక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి ఎనలేని సేవలు అందించారని, తుంగభద్ర, కృష్ణారాజ సాగరం వంటి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు సాక్ష్యంగా నిలిచాయన్నారు. పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కష్ణాజి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర గణనీయమైనదన్నారు. విశ్రాంత పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.వి.ఆర్ వెంకట రావు మాట్లాడుతూ సమాజ స్థిరత్వానికి ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రయోజనాలపై స్పష్టమైన భాగస్వామ్యం ఉండాలని, అప్పుడే విశ్వేశ్వరయ్యకు అసలైన వారసులం కాగలమని అన్నారు. సుస్థిర అభివవృద్ధికి అంకితం కావాలని, సమాజాన్ని ప్రేమించాలని, సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రాధాన్యతా భవనాల నిర్మాణంలో బాగా పనిచేసిన ఇంజినీరింగు సహాయకులకు జ్ఞాపికలతో బహూకరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ బగాది జగన్నాథరావు, జిల్లా పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ అధికారి మల్లిఖార్జున, జిల్లా ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ. ప్రభాకర రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి జె శాంతీశ్వర రావు, ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు పి.లక్ష్మణ రావు,.గంటా చంద్రమౌళి, డిఇలు లక్ష్మణరావు, రత్నకుమార్, లోకనాథం, వైద్యులు పి.అప్పారావు, ఎమ్.మధు, వి.సి.హెచ్.నాయక్, పి.వి.జ్యోతి, జిల్లా అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
105 మంది రక్తదానం
ఇంజనీర్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక పంచాయితీ రాజ్ కార్యాలయ ఆవరణలో ఇంజనీర్ల ఆధ్వర్యాన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 105 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కంటే రక్తదానం మిన్న అని అన్నారు. సామాజిక సేవా భావంతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కోరారు. యువత స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో రక్తదానంపై చైతన్యం తీసుకురావాలన్నారు. మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి జిల్లాలో రక్త నిల్వలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. పంచాయతీరాజ్, సమాచార పౌర సంబంధాల శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించి, జ్ఞాపికలను బహూకరించారు.










