ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని ఉప్పరహాల్ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో విషాదంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం రెండు ఎద్దులు, 45 మేకలు అగ్ని ప్రమాదంలో మృతి చెందాయి. గ్రామస్తుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన రైతు వెంకటేష్‌కు ఇద్దరు కుమారులు మల్లయ్య, శివలింగ ఉన్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఎద్దులతోపాటు మేకలు పెంచుకున్నారు. వీటి కోసం గ్రామ సమీపంలోని తమ పొలంలో షెడ్డును నిర్మించి ఎద్దులు, మేకలను ఉంచారు. రైతు వెంకటేష్ ఎద్దులకు, మేకలకు కాపలాగా షెడ్డులోనే రాత్రిపూట నిద్రపోయేవారు. నెల రోజుల క్రితం నిద్రిస్తున్న సమయంలో వెంకటేష్ పాము కాటుకు గురై మృతి చెందారు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పశువుల పాక షెడ్‌లో వెలుతురు కోసం దీపం పెట్టగా ఆ దీపమే అగ్ని ప్రమాదానికి కారణమై రెండు ఎద్దులు, 45 మేకలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటనతో పశు సంపదతో పాటు వ్యవసాయ పనిముట్లు కాలిపోయి బూడిదయ్యాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఎద్దులు










