May 17,2023 22:40

కలెక్టరేట్‌ ముట్టడి కరపత్రాలతో ఉపాధి కూలీలు, నాయకులు

ప్రజాశక్తి రొద్దం : కూలీలకు అనుకూలమైన ఉపాధి పనులను విరివిగా కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈసందర్బంగా సిపిఎం నాయకులు బుధవారం మండలంలోని కోగిరా, కంబాలపల్లి, శాపురం, భీదానుపల్లి, గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనుల వద్ద కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని 63గ్రామాలలో ఎక్కువ మంది ఉపాధిపనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు కార్చే పనిలో ఉందని దీంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేసవి అలవెన్సులు కల్పించాలని, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్లో ఉపాధి కూలీలకు నిధులు సక్రమంగా చెల్లించాలన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈనెల 22న తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడికిఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధికారి నారాయణ, ఉపాధి కూలీలు శ్రీరాములు, రామన్న, శకుంతల, పుల్లమ్మ, రంగయ్య, కోనప్ప, తదితరులు పాల్గొన్నారు.