ప్రజాశక్తి - బలిజిపేట : వెలుగు విఒఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో విఒఎలతో కలిసి ఎపిఎం వైఉమామహేశ్వరరావుకు వినతిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విఒఎలను దెబ్బతీసే మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, గ్రామ సమైక్య విలీనం ఆపాలని డిమాండ్ చేశారు. విఒఎలను విలీనం చేయడం వల్ల వేలాదిమందికి ఉపాధి పోతుందని విఒఎలకు జండర్ వయసు చదువు పేరుతో తొలగింపు ఆపాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, విఒఎలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, రూ.10 లక్షలతో గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, విఒఎ విలీనం ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, యాప్ వర్క్ కోసం 5 జి మొబైల్ ఇవ్వాలని, వాలంటరీ ఐడితో విఒఎలను పనిచేయించరాదని, విఒఎల ఐడి ద్వారా పనిచేయించాలని, విలీనం వల్ల ఉపాధి కోల్పోయిన విఒఎలకు నష్టపరిహారం ఇవ్వాలని, మహిళా మార్టులో సరుకులు కొనుగోలుకై టార్గెట్ ఇచ్చే పద్ధతి రద్దు చేయాలని, కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, గేదెలు లాంటివి పొదుపు సంఘాలతో బలవంతంగా కొనే పద్ధతి ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతి, సత్యవతి, ఉమా, లక్ష్మి, పార్వతి, విఒఎలు పాల్గొన్నారు.










