పార్వతీపురం: జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులంతా ప్రతి సోమవారం జరిగే జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. శాఖల వారీగా వచ్చిన వినతులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు లతో కలిసి ప్రజలు నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక వ్యక్తిగత అంశాలపై 90 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో అన్నిశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీతంపేట: ఐటిడిఏ స్పందనకు 48 వినతలు వచ్చాయి. స్పందన కార్యక్రమంలో సోమవారం ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండవానిగొరకు చెందిన భాస్కరరావు మేకలు లోను ఇప్పించాలని కోరారు. సవరపాడు చెందిన సరస్వతి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వాలంటరీ భాషా వాలంటరీ పోస్ట్ ఇప్పించాలని కోరారు. చింతల గూడ చెందిన గౌవరయ్య సవరభాష వాలంటరీ పోస్ట్ ఇప్పించాలని కోరారు. ఈ స్పందన కార్యక్రమంలో ఐటిడిఎ అన్నివిభాగాల అధికారులు పాల్గొన్నారు.
స్పందన కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురంరూరల్ : స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ''స్పందన'' కార్యక్రమంలో భాగంగా ఎస్పీ నేరుగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకొని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో 12 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి బి.నాగేశ్వరరావు, ఎస్‌బి సిఐ సిహెచ్. లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.










