May 22,2022 11:51

కొన్ని చిత్రాలు కథ, కథనం, కాన్సెప్ట్‌, క్యాస్టింగ్‌తో క్రేజ్‌ తెచ్చుకుంటాయి. తాజాగా విడుదలైన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఆ తరహాలోనిదే.. అదే లేటు వయసులో వివాహం అనే కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ మధ్యనే 'హిట్‌' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న విశ్వక్‌ సేన్‌ ఇందులో హీరోగా నటించారు. 'రాజావారు రాణి వారు', 'ఫలక్నుమా దాస్‌' వంటి సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌ చింతా ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందులో ఏం చెప్పారు? ఏం చూపించారు? అల్లం అర్జున్‌ మెప్పించాడా? తెలుసుకుందాం!

కథలోకి వెళ్తే.. అర్జున్‌ (విశ్వక్‌ సేన్‌) 30 ఏళ్లు పైబడిన అబ్బాయి. తెలంగాణ సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. వాళ్ల కమ్యూనిటీలో అమ్మాయిలు తక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతుంది. దీంతో 33 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాదు. దీంతో అందరూ తనను పెళ్లెప్పుడు పెళ్ళెప్పుడు అని విసిగిస్తూ ఉంటారు. ఇరుగుపొరుగు మాటలు భరించలేక చివరకు కులాంతర వివాహానికి రెడీ అవుతాడు. కట్నకానుకలు తీసుకోకుండా గోదావరి జిల్లాకు చెందిన మాధవి (రుక్సార్‌ దిల్లాన్‌) తో పెళ్లి ఫిక్స్‌ చేసుకుంటారు. ఎంగేజ్‌మెంట్‌ కోసం బంధుమిత్రులతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తాడు. అయితే సరిగ్గా అదే సమయానికి లాక్‌డౌన్‌ ప్రకటిస్తారు. దీంతో అర్జున్‌ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ (రితికా నాయక్‌) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్తావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? అనేదే మిగతా కథ..
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామన్‌. ఇదే పాయింట్‌ని తీసుకొని 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యాసాగర్‌. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడే వారందరికీ ఈ చిత్రం కనెక్ట్‌ అవుతుంది. వివాహానికి సంబంధించి ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న రెండు కీలక సమస్యల్ని ఇందులో చర్చించారు. పెళ్లి ఎవరి కోసం చేసుకోవాలి? సమాజం కోసమా? బంధువులు, ఇరుగు పొరుగు కోసమా? అసలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడా? లేదంటే 30 ఏళ్లు వచ్చాయి కాబట్టా? ఈ ప్రశ్నకు సమాధానం సినిమాలో చూడొచ్చు.
ట్రైలర్‌లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్‌ అంశాలకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్‌ చెల్లెలి అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్‌ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. డైరెక్ట్‌గా పెళ్లితోనే కథను మొదలుపెట్టిన దర్శకుడు.. వినోదమే ప్రధానంగా కథను మలిచారు. కులాంతర వివాహం అనే కాన్సెప్ట్‌తో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ముడిపెడుతూ పాత కథనే కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. వినోదానికి లోటు లేకపోయినా కథలో బలం లేకపోవడంతో స్లో నెరేషన్‌ ఈ సినిమాకి మైనస్‌ అయ్యింది.
పెళ్లి కోసం తాపత్రయ పడే 30 ఏళ్లు పైబడిన అబ్బాయి పాత్రలో విశ్వక్‌ సేన్‌ చాలా బాగా నటించాడు. ఎంటర్‌ర్టైన్మెంట్‌ విశ్వక్‌ పాత్ర నుంచే ఎక్కువ వస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రుక్సార్‌ దిల్లాన్‌ బాగా నటించింది. అందంతో పాటు నటన పరంగానూ మంచి మార్కులే వేయించుకుంది. ఇక రితిక నాయక్‌ ముఖ్య పాత్రలో చాలా బాగా నటించింది. గోపరాజు రమణ, నాగినీడు బాగా నటించారు. విశ్వక్‌సేన్‌ తండ్రి పాత్రలో కేదార్‌ శంకర్‌ మెప్పించారు. కాదంబరి కిరణ్‌, రాజ్‌కుమార్‌ చౌదరి, విద్య శివలెంక మిగతా నటీనటులు పాత్రల పరిధి మేర నటించారు. తమిళ హీరో అశోక్‌ సెల్వన్‌, వెన్నెల కిషోర్‌ అతిథి పాత్రల్లో మెరిశారు.
ఒక సాదాసీదా కథని సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా చూసుకున్నారు దర్శకుడు. జై క్రిష్‌ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం బాగానే ప్లస్‌ అయ్యింది. కార్తీక్‌ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించారు. గ్రిప్పింగ్‌గా ఉండే రైటింగ్‌ ప్లస్‌ అయింది.
చిత్రం : అశోకవనంలో అర్జున కళ్యాణం
నటీనటులు: విశ్వక్‌ సేన్‌, రుక్సార్‌ దిల్లాన్‌, రితికా నాయక్‌, గోపరాజు రమణ, కేదార్‌ శంకర్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు
కథ: రవికిరణ్‌ కోలా
దర్శకత్వం: విద్యా సాగర్‌ చింతా
నిర్మాత: బాపీనీడు భోగవల్లి, సుధీర్‌ ఈదర
సంగీతం: జై క్రిష్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పలనీ
ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషధం, విడుదల : మే 6, 2022