Sep 23,2023 20:05

                రెండు జిల్లాల్లో ప్రజలు స్థానిక, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిలో దీర్ఘకాలిక అంశాలతోపాటు ఇటీవల తలెత్తుతున్న సమస్యలు కూడా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ప్రారంభించాక ప్రజలు తమ అవసరాల కోసం మండల కార్యాలయాలకు వెళ్లడం తగ్గించారు. అయితే సమస్యలు పేరుకుపోతుండటంతో ప్రతి సోమవారం నిర్వహించే 'స్పందన' కార్యక్రమానికి మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. అర్జీలన్నీ ఫిర్యాదుదారునికి సంతృప్తినిచ్చేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు పదేపదే సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. అయినా అర్జీలు తగ్గకపోవడం పెరుగుతున్న సమస్యలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల ప్రతి బుధ, శుక్రవారాల్లో జిల్లాలోని రెండు మండల కేంద్రాల్లో 'జగనన్నకు చెబుదాం' పేరిట ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఏలూరు జిల్లాలో మెరుగ్గా సాగుతున్నా పశ్చిమగోదావరి జిల్లాలో వాయిదాల పర్వంతో సాగుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీనికి జిల్లా ఉన్నతాధికారులు హాజరై అర్జీలు స్వీకరిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామ సచివాలయ స్థాయిలో ప్రతి సోమవారం 'స్పందన' కార్యక్రమం నిర్వహిస్తూ వినతులు స్వీకరిస్తున్నా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదనేది అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది. మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్‌ దగ్గర నుంచి జిల్లా అధికారులంతా ఒక్కో మండలానికి వెళ్లి తీసుకుంటున్న అర్జీల పరిష్కారం ఎలా ఉంటుందో వేచిచూడాలి. కొన్ని సమస్యలకు మాత్రం జిల్లా అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. మిగిలిన అర్జీల మాటేమిటా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీటిలో ప్రభుత్వ విధానాలు, ఆర్థిక అంశాలతో ముడిపడినవే ఎక్కువ ఉంటున్నాయని, అలాగే కొన్ని రాజకీయపరమైన ఒత్తిళ్లతో పరిష్కారానికి నోచుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ ఒత్తిళ్లను జిల్లా అధికారులు పక్కన పెట్టడంతోపాటు ప్రభుత్వం సైతం ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే అర్జీల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అప్పుడే ఈ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపించినట్లని పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇక రెండు జిల్లాల్లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వివిధ సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటికీ, నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే 'దేశమును ప్రేమించుమన్నా' గేయాన్ని విద్యార్థులచే ఆలాపన చేయించడం అభినందించదగిన విషయం. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో పాలకులు ఎన్నికల ఎత్తుగడలతో స్వదేశీ నినాదం మాటున అవలంబిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలపై చర్చకు ఈ గేయాలపన అవకాశం ఇచ్చిందనే చెప్పొచ్చు. మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు చేపట్టిన విధంగానే మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెరపైకి తీసుకొచ్చారనే భావన జిల్లాలోని మహిళా సంఘాల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇది చట్టమై అమలైతేనే ఎంతోకొంత ఉపయోగముంటుందని, పేరుకే చట్టం తీసుకొచ్చి చేతులు దులుపుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే నిజమైన దేశభక్తి, మహిళాభక్తి ఉన్నట్లని వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో ప్రతిపక్ష, అధికార పార్టీలు పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అధికార పక్షం, సమస్యలపై నిలదీయాల్సిన ప్రతిపక్షం రెండూ తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతుండటంతో ప్రజా సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు అరెస్టుపై దీక్షలు, ప్రదర్శనల్లో టిడిపి నిమగమై ఉంది. అధికారపక్షం సందట్లో సడేమియాలా తన ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోంది. విద్యుత్‌ ఛార్జీల భారం మోత కొనసాగుతూనే ఉంది. దీనిపై వామపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టి తాజాగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి 27న ధర్నాలకు పిలుపునిచ్చాయి. రాజ్యాంగ పరిరక్షణ, దళితుల హక్కులకు భద్రత, మిగులు భూముల పంపిణీ, ఉపాధి హామీ సక్రమ అమలు తదితర డిమాండ్లతో కెవిపిఎస్‌, వ్యకాస దళిత రక్షణ చైతన్య యాత్ర ప్రారంభించాయి. ఈ యాత్రలోనూ పాలకులు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల పేరుకుపోయిన సమస్యలే తెరపైకొస్తున్నాయి.
ఇక విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ పాలకొల్లులో విద్యాసంస్థలను తనిఖీ చేశారు. లోపాలు గుర్తించి సరి చేసుకోవాలని హెచ్చరించారు. అందరికీ ఆదర్శంగా ఉండాలని ఉపాధ్యాయులకు క్లాస్‌ తీసుకున్నారు. మరి ఆ ఉపాధ్యాయులకు ఆదర్శంగా తాము కూడా ఉండాలని ఈ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు అన్పించడం లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువ ఉన్న సిబ్బందిని వెంటనే వేరే పాఠశాలలకు మార్చాలని ఆదేశించారు. సర్దుబాటు చేసినా సరిపడా సిబ్బంది లేకుండా నెట్టుకొస్తున్న పాఠశాలల స్థితిగతులు ఈ అధికారికి పట్టవా అనే విమర్శలు విన్పిస్తున్నాయి. వసతులు కల్పించాం, రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని అడ్డం పెట్టుకుని పాఠశాలల విలీనంతో ప్రాథమిక పాఠశాలలు బోసిపోతుండగా హైస్కూళ్లు కిటకిటలాడుతున్నాయి. నాడు-నేడు పేరిట అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలు నేడు విద్యార్థులు రాక వెలవెలబోతున్న సంగతి తెలియదా. అనాలోచిత నిర్ణయాలు మాని క్షేత్రస్థాయిలో విద్యాబోధనకు ఆటంకంగా ఉన్న అంశాలపై దృష్టి సారిస్తే విద్యావ్యవస్థ సక్రమంగా ముందుకు సాగుతుంది. యాప్‌లు, విద్యాశాఖ, సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాల బకాయిలపైనా దృష్టిసారిస్తున్న దాఖలాల్లేవు. ఇవేమీ పట్టకుండా క్షేత్రస్థాయి పర్యటనల పేరిట సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేలా బెదిరింపులకు దిగడం విద్యావ్యవస్థ నిర్వీర్యానికే తప్ప మెరుగుదలకు దోహదపడదని సదరు అధికారికి, ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారంపై నిపుణుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలే తప్ప ఉపాధ్యాయులపై వేధింపుల ఆపాలని, లేనిపక్షంలో రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఇటు విద్యావేత్తలు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం హెచ్చరిస్తున్నారు.
                                                                                                                                                                                     -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌