ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ వినాయకా.. నీవైనా సిఎం జగన్‌కు మంచి బుద్ధి ప్రసాధించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు గణేష్ ఉత్సవాల్లో భాగంగా అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమకు సిఐటియు అనుబంధ మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు, సిఐటియు 1వ నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ మాట్లాడుతూ సిఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కిల్డ్, సెమీస్కిల్డ్ వేతనాలు అమలు చేస్తూ హెల్త్ అండ్ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, 60ఏళ్ల పేరుతో తొలగించిన, అనారోగ్యంతో బాధపడుతున్న, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు డెత్ బెనిఫిట్స్‌ను ఇప్పించాలని, కార్మికులందరికీ స్థలం, పక్కా ఇల్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకుని దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు ఎర్రిస్వామి, ఇంజినీరింగ్ సెక్షన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఓబుళపతి, మురళి కమిటీ సభ్యులు పోతలయ్య, రాయుడు, మల్లికార్జున, కార్మికులు పాల్గొన్నారు.
వినాయక ప్రతిమకు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు










