చుక్కల్లో నిత్యావసరాల ధరలు
పిండి వంటలకు రూ.వేలల్లో ఖర్చు
కానరాని పండుగ సందడి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ధరల పెరుగుదల సామాన్య ప్రజానీకాన్ని పండుగలకు సైతం దూరంచేస్తోంది. పండుగ రోజున కూడా పిండివంట చేయాలన్నా, సందడిగా పండుగ చేసుకోవాలన్నా భయపడాల్సి వస్తోంది. మోడీసర్కార్ వచ్చాక వంటనూనె, కందిపప్పు, మినపప్పు ఇలా అన్ని నిత్యావసర ధరలతోపాటు, వంటగ్యాస్ ధర సైతం పెరిగిపోవడం, పన్నుల భారాలు మోపడంతో సామాన్య ప్రజానీకం పండుగలకు సైతం పిండివంటలు చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో ఒకప్పుడు ఎంతో ఆర్భాటంగా జరిగే వినాయకచవితి పండుగ సైతం జిల్లాలో సందడిలేకుండా పోయింది. ధరల పెరుగుదలతో సామాన్యుల ఇళ్లల్లో పండుగ సందడి లేక వెలవెలబోతున్నాయి.
మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక సామాన్యుల జీవనం భారంగా మారింది. రోజు గడవడమే కష్టంగా తయారైంది. కరోనా తర్వాత ఉపాధి దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు మరోవైపు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలో వినాయక చవితిని ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లాలో ఘనంగా నిర్వహించేవారు. సామాన్య ప్రజానీకం సైతం వివాహమైన కుమార్తెలను, అల్లుళ్లను, దగ్గర బంధువులను ఇంటికి పిలిచి ఎంతో సందడిగా పండుగను నిర్వహించుకునేవారు. పండుగ రోజు నాలుగైదు రకాల పిండివంటలు చేసుకుని, ఉండరాళ్లు వంటివి చేసి పూజలు చేసుకుని సంతోషంగా గడిపేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిగానీ, వినాయక చవితి సందడిగానీ జిల్లాలోపెద్దగా కనిపించడం లేదు. అందుకు ప్రధానకారణం పెరిగిన ధరలే. ప్రజలపై మోపుతున్న వివిధ రకాల భారాలే. ప్రస్తుత మార్కెట్‌లో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. వంటనూనె కిలో ప్యాకెట్ రూ.120 నుంచి రూ.160 వరకూ ఉంది. మినపప్పు కిలో రూ.125 పలుకుతుండగా, పెసరపప్పు కిలో రూ.131, వేరుశనగ గుళ్లు కిలో రూ.160, బెల్లం కిలో రూ.60 వరకూ ఉన్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.980 ఉంది. కట్టెల పొయ్యిపైన వంటచేసే పరిస్థితి ఎక్కడా లేకుండా పోయింది. ఏది చేయాలన్న వంటగ్యాస్‌తోనే చేయాలి. రెండు, మూడు రకాల పిండివంటలు చేయాలంటే వంటగ్యాస్ పెద్దఎత్తున ఖర్చవుతుంది. నెలంతా రావాల్సిన గ్యాస్ సిలిండర్ పిండివంటలకు ఉపయోగిస్తే వారంరోజుల్లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది. వినాయక చవితిరోజు పులిహోర, పొంగలి, గారెలు, బూరెలు వంటి పిండివంటలు చేయాలంటే వంటనూనె నుంచి అన్ని సరులకులు అవసరం. వీటి ధరలు భారీగా పెరిగాయి. ఏదైనా ఒక పిండివంట చేయాలన్న రూ.రెండు వేలు వరకూ ఖర్చవుతుంది. రెండు, మూడురకాలు చేయాలంటే పెద్దఎత్తున ఖర్చుపెట్టాల్సి ఉంది. రోజంతా కష్టపడి పనిచేస్తే రూ.400 నుంచి రూ.500 కూలి రావడమే గగనంగా మారింది. నెలలో సగం రోజులు పనిదొరికితే గొప్పఅన్నట్లు పరిస్థితి ఉంది. కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు, చెత్తపన్ను, నీటిపన్ను, జిఎస్‌టి ఇలా అనేక రకాల భారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. దీంతో సామాన్య కుటుంబాల జీవనం భారంగా మారింది. దీంతో పండుగ చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఇవేకాకుండా వినాయ ప్రతిమ, పూజకు ఉపయోగించే పత్రిసైతం సొమ్ములు చెల్లించి కొనుగోలు చేయాల్సిన వస్తుంది. ఇవన్నీ సామాన్యులకు పెనుభారంగా మారాయి. దీంతో ఒకప్పుడు ఎంతోఉత్సాహంగా జరిగే వినాయక చవితి వంటి పండుగ సైతం ప్రస్తుతం సందడి లేకుండా పోయింది. వినాయకచవితి మాత్రమే కాదు సంక్రాంతి, దీపావళి, దసరా వంటి పండుగలకు సైతం సామాన్య ప్రజానీకం దూరంగా ఉండాల్సిన దుస్థితి దాపురించింది. ప్రజలంతా ముక్తకంఠంతో ఉద్యమించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగొస్తాయి. లేకపోతే సామాన్యల బతుకులు రోజురోజుకు మరింత దుర్భరంగా మారే పరిస్థితి ఏర్పడనుంది.










