బకాయి వేతనాల కోసం స్కూల్ స్వీపర్ల దీక్షలు.. మూడు నెలలుగా జీతాలందక సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనలు.. లోటు వర్షపాతంతో మెట్ట రైతులు లబోదిబోమంటున్నారు. ఇటు ప్రభుత్వ తీరు.. అటు ప్రకృతి కన్నెర్రతో రెండు జిల్లాల్లో వివిధ తరగతుల ప్రజలు విలవిల్లాడుతున్నారు.
స్కూల్ స్వీపర్లు సుమారు 300 మందికిపైగా రెండు జిల్లాల్లోని ఏలూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర మున్సిపాల్టీల్లో పని చేస్తున్నారు. వీరికి గతంలో ఆయా మున్సిపాల్టీలే జీతాలు చెల్లించేవి. వీరు పార్ట్‌టైమ్ కంటింజెంట్ వర్కర్స్‌గా చెబుతున్నా ఉదయం నుంచి సాయంత్రం వరకూ గదులు, గ్రౌండ్ శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులన్నీ చేస్తూ ఫుల్‌టైమ్ వర్కర్లుగానే ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనం మాత్రం రూ.4 వేలు మాత్రమే. 2022 ప్రభుత్వం జిఒ తీసుకొచ్చి వీరిని విద్యాశాఖలో విలీనం చేసింది. అయితే విద్యాశాఖాధికారులు మాత్రం వీరికి వేతనాలివ్వడం లేదు. అయితే మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకూ తమ అధీనంలో పని చేశారనే సానుకూల దృక్ఫథంతో 2023 మార్చి వరకూ వేతనాలు చెల్లించారు. అయితే విద్యాశాఖకు వెళ్లారనే జిఒ కారణంగా ఏప్రిల్ నుంచి వీరికి మున్సిపాల్టీలు వేతనాల చెల్లింపు నిలిపివేశాయి. జిఒ ప్రకారం వేతనాలివ్వాల్సిన విద్యాశాఖ మొద్దునిద్ర వీడటం లేదు. ఫలితంగా గత ఐదు నెలలుగా వేతనాలు లేక చిరుద్యోగులైన స్కూల్ స్వీపర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతూ, పేరుకు పార్ట్‌టైమ్ కంటింజెంట్ వర్కరే అయినా స్కూల్‌లోనే పూర్తి టైమ్ ఉంటూ వేరే పని చేసే అవకాశం లేక, మరోపక్క కొద్దిపాటి వేతనమూ అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. సుమారు ఐదు రోజులుగా తమ బకాయి వేతనాలు ఇవ్వాలని స్కూల్ స్వీపర్లు ఏలూరులోని డిఇఒ కార్యాలయం వద్ద నిరాహారదీక్షలు చేపట్టినా అటు విద్యాశాఖాధికారులుగాని, ఇటు అధికారపార్టీ ప్రజాప్రతినిధులుగానీ స్పందించకపోవడం బాధాకరం. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు సైతం రూ.నాలుగు వేలు వేతనం కూడా బకాయిలు పెట్టడంపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్కూల్ స్వీపర్లకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇదే పరిస్థితి సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి. ఇప్పటికి మూడు నెలలుగా వేతనాల్లేక ఆ శాఖలోని వివిధ తరగతుల సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు వేతనాలిప్పించాలంటూ గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాలకు వినతులిచ్చి నిరసన తెలిపారు. వీరికి జీతాలివ్వడానికి బడ్జెట్ లేదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులతో అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. విద్యార్థులను ఈ తరహా పర్యటనకు తీసుకెళ్లడం కచ్ఛితంగా అభినందనీయమే. అయితే ఆ శాఖలో పని చేసే స్కూల్ స్వీపర్లకు, అనుబంధ విభాగమైన సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలివ్వకుండా పస్తులుంచడం ఎంతవరకూ న్యాయమో ప్రభుత్వం, ఉన్నతాధికారులే చెప్పాలి.
ఇక జిల్లాను లోటు వర్షపాతం వెంటాడుతోంది. ఇటీవలకాలంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాభావంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చెరువులు అడుగంటడం, బోర్లు సరిగ్గా పని చేయని పరిస్థితి రావడంతో పంటలు ఎండిపోవడంతో పాటు పశువులు దాహర్తితో అలమటిస్తున్నాయి. ఇప్పటికే గత నాలుగు నెలల్లో జులై మినహా జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం లోటు స్పష్టంగా లెక్కలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వంగానీ, జిల్లా అధికారులుగానీ దీనిపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. ప్రత్యామ్నాయ పంటల సాగు, పశువుల తాగునీటి కోసం ప్రత్యేక చర్యలతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చూపడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో పచ్చని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కరువు కోరలు చాచే ప్రమాదం పొంచి ఉంది. ఎన్నికల హడావుడిలో నిమగమైన అధికార పక్షం, అధికారులు ఈ సమస్యలపై ఇప్పటికైనా దృష్టి సారించకపోతే కచ్ఛితంగా ఎన్నికల్లో ఆయా శక్తులు, ప్రజలు గుణపాఠం చెబుతారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










