
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులను కల్పించిందని, వాటిని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని శనివారపు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారపాటి ప్రకాశ్ రావు తెలిపారు. దొండపాడులోని ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం వారు శనివారపు పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016 వికలాంగుల హక్కుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మాట్లాడుతూ జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వహించు కార్యక్రమాల గురించి, ఈ కేంద్రం అందించే సేవలైన కృత్రిమ అవయవాలు అమర్చడం, ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ గురించి వివరించారు. జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ఫిజియో థెరపిస్ట్ జి.రాంబాబు మాట్లాడుతూ వికలాంగులను అవహేళన చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర వివరాలకు 08812 - 249297, 7386565469లను వికలాంగులు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.