Oct 30,2023 21:24

ఫొటో : మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

విజయవంతంగా బహిరంగ సభ
ప్రజాశక్తి-ఉదయగిరి : వైసిపి చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభను ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. సోమవారం నియోజకవర్గంలోని వింజమూరులో ప్రారంభమైన సామాజిక సాధికార యాత్ర ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌ చేరుకొని మంగళ హారతులు పూలస్వాగతాల నడుమ బాణాసంచారాలు మేళతాళాలు తప్పెట్లతో హైస్కూల్‌ ప్రాంగణంలోని బహిరంగ సభ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ బహిరంగ సభతో ఉదయగిరి నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో డిప్యూటీ సిఎంలు నారాయణస్వామి, అంజద్‌ భాషా, మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌సి ఎస్‌టి బిసిలను పాలితులుగా ఉన్న స్థాయి నుంచి పాలకులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిదే అని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు బిసిలే పార్టీకి వెన్నెముక అంటూ బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితన మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్‌సిలను ఎస్‌టిలను బిసిలను భాగస్వాములను చేసుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రస్తుతం రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ఒక్కడే ఒకవైపు ఉన్నాడని, చంద్రబాబు నాయుడు కూటమి పేరుతో పొత్తు పెట్టుకొని ముందుకు వస్తున్నాడని జగన్మోహన్‌ రెడ్డి పొత్తు ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి పొందడం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఈ విషయం ప్రజలందరూ గుర్తించాలని కోరారు. కరోనా విపత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్‌ రెడ్డి చేసి చూపించాడని తెలియజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్‌ రావు, పార్టీ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి.స్రవంతి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.