Oct 10,2023 21:17

తవ్వకాల అనుమతులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ప్రజాశక్తి - మక్కువ :  మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధిలోని మక్కువ చిన్న భోగిలి రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ కంకరకొండ వద్ద అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వాహనాలను విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్న పలాసకు చెందిన వ్యక్తి నుండి సుమారు రూ.59వేలకు పైబడి అపరాధ రుసుం వసూలు చేశారు. ఎటువంటి ప్రభుత్వ రసీదులు లేకుండా ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని విజిలెన్స్‌ అధికారులు హెచ్చరించారు. ఇక్కడ క్వారీ నుండి అక్రమంగా కంకరను ఓ లేఅవుట్‌కు తరలిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మండలంలోని అధికారుల మెతక వైఖరి కారణంగా అక్రమంగా ఎస్‌.పెద్దవలస రెవెన్యూ పరిధిలోని, శంబర-బట్టివలస రహదారికి ఆనుకొని ఉన్న కొండలను తవ్వేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీటిపై కూడా ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.