సాలూరు: సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులపై తీవ్ర పని ఒత్తిడి కనిపిస్తోంది. గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, అమ్మకాలు, కోత సమయంలో దిగుబడి, ఒకవేళ నష్టం వాటిల్లితే కారణాలు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధించిన యాప్‌ల ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ రకాల యాప్‌ల ద్వారా వారు సమాచారాన్ని అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో రైతులు పండించిన పంటల ఆధారంగా ఎప్పటికప్పుడు వివరాలను అప్ లోడ్ చేయాలని మండల, జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాలిస్తారు. గ్రామాల్లో రైతు పంట పొలాల్లోకి వెళ్లి ఫొటోలతో సహా వివరాలు పొందుపరిచాల్సి ఉంటుంది. ఈ విధుల నిర్వహణలో కింద స్థాయిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మహిళా ఉద్యోగులు, ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేధించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా కొంతమంది మహిళా ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారు. గత మూడేళ్లలో కొంతమంది మహిళా వ్యవసాయ సహాయకులు ఒత్తిడిని తట్టుకోలేక గర్భస్రావానికి గురైన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో సుమారు 350 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 200మంది వరకు మహిళా వ్యవసాయ సహాయకులు పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయాలు కింద స్థాయిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులపై తీవ్ర పని ఒత్తిడి పెంచుతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో పంటలు, విత్తనాలు, ఎరువులు, రైతులకు సంబంధించిన వివరాలను సమయానుకూలంగా యాప్‌ల్లో వ్యవసాయ సహాయకులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఇ-క్రాప్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 18 తర్వాత విడుదల చేసింది. ఖరీఫ్‌లో రైతులు పండించిన పంటల సాగుకు సంబంధించిన ఇ క్రాప్, ఇకెవైసి యాప్‌ల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆగష్టు 20 తర్వాత ఇ- క్రాప్ యాప్ వినియోగంలోకి వచ్చింది. జూన్ నుంచే ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. అంటే ఇ-క్రాప్ యాప్ కూడా అదే నెల నుంచి వినియోగంలోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాప్ ఆగష్టు 20 తర్వాత వినియోగంలోకి రావడంతో వ్యవసాయ సహాయకులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల వరకు పంట భూములు ఉంటాయి. ఈ భూముల్లో సాగు విస్తీర్ణం, ఏఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను ఇ-క్రాప్‌లో నమోదు చేయాలి. రైతులకు సంబంధించిన పొలాల్లోకి వెళ్లి నమోదు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరుతో ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇ- క్రాప్ నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 11 వరకు కొనసాగించారు. నాలుగు నెలల ఖరీఫ్ సీజన్లో నిదానంగా జరగాల్సిన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని ఏజెన్సీ ప్రాంతంలో ఇ- క్రాప్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం వ్యవసాయ సహాయకులకు కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ బిజీగా ఉన్న కారణంగా ఇంటర్నెట్ పని చేయకపోవడంతో సర్వర్ పని చేస్తున్న సమయంలోనే ఉద్యోగులు ఇ క్రాప్ నమోదు చేయాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిశిఖర గ్రామాలకు వెళ్లి ఇ- క్రాప్ నమోదు చేయాల్సి రావడం, నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించగలమో లేదోనన్న ఆందోళన మహిళా ఉద్యోగులను అనారోగ్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యవసాయ సహాయకులకు గర్భస్రావం అయినట్లు తెలిసింది.
సమస్యల్ని రాష్ట్ర నాయకత్వానికి చెప్పాం
కింద స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర నాయకత్వానికి చెప్పాం. పని ఒత్తిడి బాగా పెరిగింది. ప్రతీ పని యాప్ ల్లో నమోదు చేయడం, ఇంటర్నల్ సౌకర్యం లేక, సర్వర్ బిజీగా వున్న కారణాలు వల్ల సకాలంలో నిర్ధేశిత లక్ష్యాన్ని చేరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం సకాలంలో ఇ-క్రాప్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంతో పని ఒత్తిడితో కొంత మంది మహిళా ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు.
సంతోష్,
గ్రామ వ్యవసాయ సహాయకుల సంఘం అధ్యక్షుడు,
పార్వతీపురం మన్యం జిల్లా.










