ప్రజాశక్తి-పార్వతీపురం : పెంచిన విద్యుత్తు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.మన్మథరావు మాట్లాడుతూ ప్రజల కళ్లు కప్పి దొడ్డిదారిన సర్దుబాటు ఛార్జీల పేరుతో సామాన్యులను దోచి కార్పొరేట్ల జేబులు నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తు ఛార్జీల పెంపు, విద్యుత్తు సంస్కరణ బిల్లును రద్దు చేయాలని శాంతియుతంగా పోరాటాలు చేస్తున్న ప్రజా సంఘాలు, పార్టీల నాయకులపై పోలీసులు తీవ్ర నిర్బంధం విధిస్తున్నారని మండిపడ్డారు. సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టరాదని, ప్రజలపై భారాలు వేయవద్దని కోరారు. విద్యుత్తు సంస్కరణల బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు కోతలు అరికట్టాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, ఎస్‌సి, ఎస్‌టి, వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్లలోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. లేకుంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఓ వెంకట రావుకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమ ంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకట రమణ, ఎస్.ఉమ, బంకురు సూరిబాబు, ఇందిర, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు పి.సంఘం, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు పి.శ్రీనునాయుడు, భాస్కరరావు, సిపిఐ జిల్లా నాయకులు టి.జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.










