అనంతపురం కలెక్టరేట్ : ప్రజలపై భారాలు మోపేలా పెంపుదల చేసిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐంఎంఎల్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఏసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూఆప్, సర్దుబాటు, సెస్ ఛార్జీలంటూ వివిధ రకాల పేర్లతో ఎంత వీలైతే అంత పెద్దఎత్తున విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతోందన్నారు. ఇప్పటి వరకు రూ.450 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాత్రం రూ.450 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారాలు మోపిన ఒకేసారి ప్రజలపై పడకుండా కొన్ని నెలలు విరామం ఇచ్చి సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు మోపి మోసగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో మీటర్ల వ్యవస్థనే మార్చి అదానీ కంపెనీలకు ఉపయోగపడేలా గృహాలకు, వ్యవసాయానికి కూడా మీటర్లు బిగిస్తూ వేల కోట్లు రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చెబుతూనే వ్యవసాయ బోర్లకు మీటర్‌లు బిగించి రాబోయే రోజుల్లో భారాలు మోయడానికి కుట్ర చేస్తోందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు మిగించడమే అన్నారు. ఇటీవలి కాలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టులతో ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా ప్రభుత్వాల తీరు ఉందన్నారు. చంద్రబాబు రూ.371 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారనే ఆయన్ను అరెస్టు చేశారన్నారు. విద్యుత్ భారాల రూపంలో ప్రజలపై రూ.5 వేల కోట్లు భారాలు పడుతుంటే మాత్రం ప్రభుత్వ పెద్దలు మాట్లాడేందుకు నోరురాకపోవడం విచారకరం అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 27న అనంతపురం పాతూరు పవర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గృహాలకు అమర్చే స్మార్ట్ మీటర్‌ల కోనుగోలులో కూడా అత్యధిక ధరలు వెచ్చించి ఆ భారాలు కూడా ప్రజలపై మోపుతోందన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్‌లు బిగించే కుట్ర చేస్తున్నారని, ఆ మీటర్‌లే ప్రభుత్వ పతనానికి నాందికానున్నాయన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటులో కూడా అధిక ధరలతో మీటర్లు కొనుగోలు చేస్తోందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అనుసరించిన విద్యుత్ సంస్కరణలే ఇప్పుడూ అనుసరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో వైసిపి ప్రభుత్వానికి కూడా పతనం ప్రారంభమైందన్నారు. ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐంఎల్ నాయకులు చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఏసురత్నం మాట్లాడుతూ 27న నిర్వహిస్తున్న ధర్నాకు విద్యుత్ వినియోగదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం. బాలరంగయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.నారాయణస్వామి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










