ప్రజాశక్తి-దరిశి: విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరకంగా దరిశి గడియారస్తంభం సెంటర్‌లో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఓటింగ్‌లో 202 మంది పాల్గొనగా వ్యతిరేకంగా 192 మంది, అనుకూలంగా ఏడుగురు, ముగ్గురు చెల్లని ఓట్లుగా వేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ కార్యద ర్శులు తాండవ రంగారావు, మాడపాకుల రమేష్, నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కరుణానిధి, ఉప్పు నారాయణ, రంగా రావు, గోగు వెంకయ్య, నాగేశ్వరరావు, కేవీ పిచ్చయ్య పాల్గొన్నారు.
హనుమంతునిపాడు: ప్రజలపై విద్యుత్ భారాలను మోపడం అన్యాయమని, తక్షణం విద్యుత్ భారాలను ఉపసంహరించు కోవాలని కోరుతూ హనుమంతునిపాడు మండల కేంద్రంలో ప్రజా ఓటు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని హనుమంతునిపాడు ఎంపీటీసీ సభ్యులు ఉడుముల సుబ్బారెడ్డి తన మొదటి ఓటు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులపై విద్యుత్తు భారాలు మోయలేనివిగా ఉండకూడదని, కరెంటు చార్జీలు గతంతో పోలిస్తే రెండు రెట్లు అదనంగా ప్రజలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం నాయకుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల కళ్లు కప్పి దొడ్డిదారిన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రజలపై భారాలు వేయటం మాట తప్పడం, మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తే జగన్మోహన్‌రెడ్డి దానికి విరుద్ధంగా నిర్ణయాలు చేయటం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. గ్రామ మాజీ సర్పంచ్ మురహరి నరసయ్య మాట్లాడుతూ ప్రజలు వాడుకునే విద్యుత్తు కన్నా కూడా అదనంగా చెల్లిస్తున్న సబ్ ఛార్జీలు బాదుడే ఎక్కువగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని విద్యుత్తు చార్జీల వడ్డనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కత్తి ఏబు, సభ్యులు పలికినేటి ఏలియా, గురునాథం, రాములు, దారా నారాయణ, గుమ్మ కొండయ్య, ఆండ్రా వినరు, కత్తి మత్తయ్య, కొండారెడ్డి, నారాయణరెడ్డి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.










