విద్యుత్ చార్జీలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి - నందికొట్కూరు
వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, లేకపోతే చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే సిఎం జగన్‌కు పడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. శుక్రవారం నందికొట్కూరు సిపిఎం కార్యాలయం ఆవరణలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుదలపై రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం నాయకులు పి పకీర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, డాక్టర్ వినోద్ కుమార్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అల్లప్ప, మజీద్ మియా, అరుణ్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షురాలు రంగమ్మ ,మాల మహానాడు నాయకులు శివ, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకులు బాలస్వామి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణలు తెచ్చి డిస్కో, ట్రాన్స్కో, జెన్కో పేరుతో విద్యుత్ రంగాన్ని మూడు ముక్కలు చేసి ప్రజలపై భారాలు మోపారని, వాటి వ్యతిరేకంగా ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వామపక్షాలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల పాటు అధికారం కోల్పోవడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి తలొగ్గి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో నాలుగు సంవత్సరాల కాలంలో రూ.25 వేల కోట్లు ప్రజలపై భారం మోపడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీన నందికొట్కూరులో కిసాన్ పార్క్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు టి ఓ బ్లెస్, వేణుగోపాల్, రమేష్ ,సీతారాం వెంకటేశ్వర్లు, గౌడ్ ,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలి : సిపిఎం
ప్రజాశక్తి - బేతంచర్ల
సామాన్య పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీల పెంపుదలను ప్రజలు వ్యతిరేకించాలని బేతంచర్ల సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు, సిపిఎం సీనియర్ నాయకులు వై ఎల్లయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో కరెంట్ బిల్లులతో జనానికి షాక్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలకు షాక్ ఇస్తున్నాయన్నారు. నాలుగేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపాయన్నారు. పెంచిన కరెంటు చార్జీలను, సర్దుబాటు చార్జీలను విరమించుకోవాలని, లేనిపక్షంలో పోరుకు ప్రజలతో కలిసి సిపిఎం సిద్ధమవుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎంకమిటీ సభ్యులు బి రామాంజనేయులు, జి. శోభారాణి, ఎస్. గుల్జార్ బి, ఎస్‌కే బాష, రాజబాబు, బాలయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.
మరో కరెంటు పోరాటానికి సిద్ధం కావాలి.
పాములపాడు: మరో కరెంటు ఉద్యమానికి రైతాంగం ప్రజలు సిద్ధం కావాలని రైతు సంఘం సీనియర్ నాయకులు బి రామేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాములపాడలో వ్యకాసం జిల్లా నాయకులు బాలయ్య అధ్యక్షన కరెంటు బిల్లులతో జనానికి షాక్ కార్యక్రమంలో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్‌ఆర్ రమణ, మహిళా సంఘం నాయకురాలు రవణమ్మ, మాల మహానాడు జిల్లా నాయకులు అబ్రహాము, రజక సంఘం నాయకులు రామకృష్ణ, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు షర్పుద్దీన్‌అలీ, నాయకులు నాగరాజు, కెవిపిఎస్ నాయకులు జయరాజు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రమేష్, తదితరులు మాట్లాడారు.










