Aug 19,2023 20:08

మృతి చెందిన గొర్రెలు

ప్రజాశక్తి - దేవనకొండ
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై 36 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని గద్దెరాళ్ల గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. గొర్రెల కాపరులు, స్థానిక రైతుల వివరాల మేరకు... పల్లెదొడ్డి గ్రామానికి చెందిన వడ్డే లింగన్న, నాగేష్‌కు చెందిన గొర్రెల మందను మేపేందుకు గద్దె రాళ్ల గ్రామ శివారులో హంద్రీనీవా కాలువ గట్టుపై నుంచి తోలుకెళ్తున్నారు. అక్కడే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ గుండా వెళ్లిన విద్యుత్‌ తీగలు తెగి కింద పడి ఉన్నాయి. గమనించకుండా ముందు వెళ్తున్న గొర్రెలకు విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందాయి. గమనించిన గొర్రెల కాపరులు అక్కడే పొలాల్లో ఉన్న రైతులకు తెలపడంతో విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న విద్యుత్‌ సరఫరా బంద్‌ చేశారు. బాధిత గొర్రెల పెంపకందారునికి సుమారు రూ.3.80 లక్షల దాకా నష్టం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పశువైద్యాధికారి వెంకటేష్‌ ఆధ్వర్యంలో గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.