ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ విద్యతోనే అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక జయమానెమ్మ కళ్యాణ మండపంలో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరంగయ్య అధ్యక్షతన నిర్వహించిన నాయీబ్రాహ్మణ విద్యార్థుల ప్రతిభ పురస్కార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గౌరవాధ్యక్షులు ఎం.సుబ్రమణ్యం ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కతిక సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గుంటూరు పివి.రమణయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎంబి ఉమామహేశ్వరి, రాష్ట్ర కోశాధికారి బాలతాత మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష ఉంటే సాధించలేనిది ఏదీలేదన్నారు. నాయీ బ్రాహ్మణ విద్యార్థులు ఎవరికీ ఏమాత్రం తీసిపోరన్నారు. నైపుణ్యత, సమర్థత, కమ్యూనికేషన్ స్కిల్స్ మనరక్తంలోనే ఉన్నాయన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో కుల గౌరవ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయవచ్చన్నారు. ముఖ్యంగా దేశసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో మరింత స్ఫూర్తి, ప్రేరణ కలిగించాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2022-23లో టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన 42 మందికి, ఇంటర్‌లో 8 మంది విద్యార్థులకు రూ.వేయి చొప్పున నగదు, మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. కాగా విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు కర్నూలు సీఐ ఉపేంద్ర రూ.2లక్షల చెక్కును సంఘం నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి పాకాల కొండయ్య, అనంతపురం జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ఎస్ కుమరేశ్వరన్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్ విజయవాడ సురేంద్రబాబు, ఆర్‌డిటి ఛైౖర్మన్ తిప్పేస్వామి, చిన్నపిల్లల వైద్య నిపుణులు, విశ్రాంత మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, డిప్యూటీ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విజయవాడ రామనాథరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు దేవప్రసాదరావు, కర్నూలు సిఐ మారూరు ఉపేంద్రబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వివేకానంద స్వామి, పిటిసి సిఐ ఆర్.కృష్ణమోహన్, శింగనమల ఎంఇఒ నరసింహరాజు, శ్రీనిధి ఎజిఎం హనుమేష్‌బాబు, 50వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌బాబు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసులు, ఆత్మీయ నిర్వాహక బృందం జిల్లా సంఘం గౌరవ సలహాదారులు శివప్రసాద్, కె.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలు పొందిన విద్యార్థులతో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు










