ప్రజాశక్తి-ఆలూరు
'విద్యార్థుల ఫీజులు ఎక్కడ కంస మామ' అంటూ ఆలూరులో విద్యార్థులు టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. మంగళవారం ఆలూరులోని అంబేద్కర్ కూడలిలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డే పెద్దయ్య, ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంతకుముందు విద్యార్థులతో అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ విడుదల చేయాలని కోరారు. టిడిపి ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వగా జగన్ ప్రభుత్వం 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించడం దుర్మార్గమని విమర్శించారు. విద్యా దీవెనను విద్యార్థుల దగాగా మార్చారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చేది గోరంత ప్రచారం కొండంత అని మండిపడ్డారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డే పెద్దయ్య మాట్లాడుతూ... నాణ్యమైన విద్యలో నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం చంద్రబాబు నాయుడు హయాంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో 19వ స్థానానికి దిగజారిందని తెలిపారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలూరు తాలూకా అధ్యక్షులు తలారి సిద్ధప్ప, ఉపాధ్యక్షులు రవితేజ, మండల అధ్యక్షులు రాఘవేంద్ర, మండల నాయకులు వివేక్, వినరు, జితేంద్ర, కేదార్, అఖిల్, ఈర్షద్, చరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ










