Sep 06,2023 21:57

కూలిపోయిన పాఠశాల ప్రహరీగోడ

ప్రజాశక్తి - గరుగుబిల్లి : విద్యార్థుల ప్రాణాలంటే అధికారులకు చులకనగా మారినట్లుంది. ప్రాణాలు పోయిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం, బాధిత కుటుంబానికి తూతూ మంత్రంగా సాయం చేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారింది. చిన్నారుల ప్రాణాలు గాల్లోకి కలవకముందే ముందస్తు చర్యలు తీసుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. మండల విద్యాశాఖాధికారులు తీరు కూడా ఇలాగే ఉంది. మండలంలోని నాగూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నెల రోజుల కిందట కూలిపోయింది. అప్పటి నుంచి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కూలిన ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణం చేపట్టలేదు. కనీసం ముళ్ల కంపలనైనా పెట్టలేదు. ప్రవాహరీ గోడ కూలిన తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడడం సరికాదని మండిపడుతున్నారు. తక్షణమే గోడ కూలిన చోట నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
ప్రమాదం జరిగిన తర్వాత హడావిడి చేయడం అధికారులకు అలవాటుగా మారిపోయంది. మండలానికి పక్కనే ఉన్న కురుపాం మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఏలూరు జిల్లా బూట్టాయగూడెం ఎస్టీ హాస్టల్‌ లో నిద్రిస్తున్న విద్యార్థిని కూడా పాము కాటేయడం వల్ల మృత్యువాతపడ్డాడు. ఈ మరణాలన్నీ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లేనని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా ఎవరో ఒకరి ప్రాణం పోతేగాని విద్యాశాఖాధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు నాగూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రక్షణ కూడా కరవైంది. ప్రహరీ కూలిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకునే అవకాశముంది.
పిల్లల ప్రాణాలకు ఠికానా లేదు.
పార్వతీపురం-పాలకొండకు వెళ్లే రాష్ట్ర రహదారి పక్కనే ఈ పాఠశాల ఉంది. ఆ స్కూల్‌ పక్కనే వ్యవసాయ భూములున్నాయి. వాటి నుంచి పాములు, ఇతర విష జంతులు కూలిన ప్రహరీ గోడ మీదుగా పాఠశాలలోకి వెళ్లే ప్రమాదముంది. ప్రస్తుతం కుక్కల హడావిడి ఎక్కుగా ఉంది. పొరపాటున కుక్కల గుంపు పాఠశాలలోకి చేరితే తమ పిల్లల పరిస్థితేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలను ఆనుకుని నిత్యం రద్దీగా ఉండే రాష్ట్ర రహదారి ఉంది. ఈ రహదారి మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పిల్లలు ఆడుకుంటూ పొరపాటున రోడ్డు మీదకు వస్తే... ఈ ఆలోచనే భయకరంగా ఉంది. చావు ముంగిట అక్షరభ్యాసం చేస్తున్న విద్యార్థుల రక్షణకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ప్రమాదాల నడుమ తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపగలమని నిలదీస్తున్నారు.
విద్యాశాఖాధికారి స్పందన కరవు
ఇదే విషయమై మండల విద్యాశాఖాధికారి నగిరెడ్డి నాగభూషణరావును 'ప్రజాశక్తి' వివరణ కోరగా, తర్వాత మాట్లాడుతానని చెప్పి ఫోను పెట్టేశారు. పాఠశాల విద్యా కమిటీ కమిటీ చైర్మన్‌ను ప్రహారీ గోడ నిర్మాణంపై ప్రశ్నించగా, నాడు-నేడు నిధులొస్తే పని మొదలు పెడతామని సమాధానమిచ్చారు. ఇలా ఎవరూ విద్యార్థుల రక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల ప్రహరీగోడ నిర్మించి, తమ పిల్లల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.