Sep 23,2023 21:20

పాఠశాలను సీజ్‌ చేస్తున్న విద్యాశాఖ అధికారులు

            ప్రజాశక్తి-గుంతకల్లు   పట్టణంలో విద్యార్థిని మృతికి కారణమైన శ్రీవిద్య ప్రయివేటు పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. విద్యార్థిని మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు శనివారం పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారించి పాఠశాలను సీజ్‌ చేశారు. పాఠశాలకు డిఇఒ వచ్చిన విషయాలన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో దాదాపు 12 పాఠశాలలు బండల షెడ్లలో నిర్వహిస్తున్నారన్నారు. వాటిని వెంటనే సీజ్‌ చేయడంతోపాటు ఆయా పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు డిఇఒ స్పందించి బండల షెడ్లలో పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలను గుర్తించి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామన్నారు. నోటీసులకు స్పందించి పాఠశాలలను మార్చుకోకపోతే సీజ్‌ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్‌నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకీ, ఏబీవీపీ కార్యదర్శి శివకుమార్‌, చందు తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.