Aug 06,2023 20:26

చికిత్స పొందుతున్న ఆస్పత్రి

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని మండగిరి పంచాయతీ పరిధిలోని బీసీ బాలికల కళాశాల హాస్టల్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న కల్పన అనే విద్యార్థిని విషపురుగు కుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని కల్పనను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు వెళ్లాలంటూ వైద్యులు రిఫర్‌ చేశారు. హాస్టల్‌ వార్డెన్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదోని నుంచి కర్నూలుకు వచ్చేందుకు సమయం పడుతుందని, మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సూచించారు. ఎస్‌కెడి కాలనీలో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో విద్యార్థికి ఐసియులో చికిత్స అందిస్తున్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్‌ డిడి వెంకటలక్ష్మి అక్కడికి చేరుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనను పరామర్శించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం కుదుటపడుతోందని, ఐసియులో చికిత్స అందుతోందని డిడి వెంకటలక్ష్మి ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము కర్నూలుకు తీసుకొచ్చేలోపు ఆలస్యం అవుతుందని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థిని కొలుకుంటుందన్నారు. ఎస్‌కెడి కాలనీలో బాలికల కళాశాలకు సమీపంలో ఉన్న హాస్టల్‌ను గతేడాది ఖాళీ చేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్‌ గాంధీ నగర్‌లో ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతం కావడం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత ఉండడంతోనే విషపురుగులు కుట్టాయని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ భవనంలో ఉండలేమంటూ ఇటీవల విద్యార్థులు తమ ఆవేదనను వెల్లగక్కారు. ప్రత్నామ్నాయం చూడకుండా వార్డెన్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని బాలికలు వాపోతున్నారు.
అయోమయానికి గురి చేస్తున్నారు
- విద్యార్థిని తల్లి లక్ష్మి

విద్యార్థిని కల్పన ఆదోనిలోని మధు ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటుందంటున్నారు. డాక్టర్లు వస్తున్నారు. చూస్తున్నారు. పోతున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. అయోమయానికి గురి చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి మా బిడ్డ ప్రాణాలను కాపాడాలి.