Apr 28,2023 22:13

అలీషా జాస్మీన్‌ సిద్దం చేసిన ప్రాజెక్టును పాఠశాలకు అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తన తోటి విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకోవాలని సంకల్పించి, పాఠశాల పూర్వ విద్యార్థి ఆలిషా జాస్మిన్‌ చేసిన ఆలోచన విధానం అద్భుతమైనదని అల్‌ హిలాల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అక్బర్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలోని అల్‌హిలాల్‌ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి అలీషా జాస్మిన్‌ కృష్ణాజిల్లా నందిగామలో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ విద్యలో ఇంజనీరింగ్‌ చదువుతోంది. తాను విద్యనభ్యసిస్తూ తోటి విద్యార్థులకు తనవంతుగా ఏదో ఒక సహాయం చేయాలని సంకల్పించింది. 1975లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఆర్యభట్‌ శాటిలైట్‌ నుంచి ఇప్పటి వరకు ఎన్ని శాటిలైట్లు ప్రయోగించారు, వాటి పనితీరును వివరిస్తూ చార్టులను, ప్రయోగించిన రాకెట్ల శాటిలైట్లను తయారు చేసి తన తల్లి సల్మా భానుతో పాటు తనకు ట్యూషన్‌ చెప్పిన మాస్టర్‌ రాజు, రంజిత్‌, కృష్ణల చేతుల మీదుగా పాఠశాలకు శుక్రవారం అందించింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం అక్బర్‌ షరీఫ్‌ మాట్లాడుతు ప్రతి సంవత్సరం పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది తమ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళుతుంటారన్నారు. అందులో కొంతమంది మాత్రమే చదివిన పాఠశాలకు, విద్యార్థులకు చేయూతనివ్వాలని అనుకుంటారని అన్నారు. అలీషా జాస్మిన్‌ చదివిన పాఠశాలకు, విద్యార్థులకు తన వంతుగా ఏదో చేయాలని సంకల్పించి పరీక్షల సమయంలో సైతం తన చదువును చదువుకుంటూ, పాఠశాలకు కొంత సమయాన్ని కేటాయించి భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సందర్భాల్లో ఏ ఏ శాటిలైట్లు ఉపయోగించారు, వాటి పనితీరును ఆంగ్లం, హిందీ భాషలో వివరిస్తూ ప్రాజెక్టులను సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. వాటిని తన తల్లి సల్మా భాను, చదువు చెప్పిన గురువుల చేతుల మీదుగా పాఠశాలకు అందివ్వడం గొప్ప విషయమన్నారు. ప్రతి విద్యార్థి అలీషా జాస్మిన్‌ ను ఆదర్శంగా తీసుకొని చదువుకున్న పాఠశాలకు చేయూతనివ్వడానికి ముందుకు రావడంతో పాటు బాగా చదువుకొని తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఫౌజియా, షబీనా, లక్ష్మీకాంత్‌, పాఠశాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.