Aug 25,2023 23:06

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలోని చింతలగుంట గ్రామంలో ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్‌లో గురువారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన 2వ తరగతి విద్యార్థి లంకా కార్తీక్‌(7) మృతదేహానికి కె.వి.పి.ఎస్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌, సిఐటియు మండల నాయకులు బి.వి.శ్రీనివాసరావులు నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అనంతరం మండల తాసిల్దార్‌ అబ్దుల్‌ రహమాన్‌ మస్తానా తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిహెచ్‌ రాజేష్‌ మాట్లాడుతూ నిర్మాణంలో పక్కన స్కూల్‌ జరుగుతుంటే ఎటువంటి కనీస సౌకర్యాలు లేని పూరిపాకలో పాఠశాలను నడపడానికి విద్యాశాఖ అధికారులు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి రెండు రోజు కావస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంతవరకు కనీసం పరామర్శించలేదని విమర్శించారు. సిపిఎం పార్టీ నాయకులు బివి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నష్టపరిహారం కింద ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందించాలని కోరారు. కుమారుడిని పోగొట్టుకున్న తండ్రి వెంకటేశ్వర రావు అవిటివాడు కావడం వల్ల ప్రభుత్వం ఉపాధి కల్పించి సొంత గహం కోసం స్థలం కేటాయించాలని కోరారు. అధికారులు దీనిపై స్పందించకపోతే జిల్లా కలెక్టర్‌ దష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి కుటుంబానికి న్యాయం జరిగేలా కషి చేస్తామని చెప్పారు.