Oct 02,2023 20:57

సైకిల్‌యాత్ర ప్రారంభ సభలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్‌

పాచిపెంట: జిల్లాలోని విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్రను పాచిపెంటలో సోమవారం రామ్మోహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై ఈనెల 2 నుంచి 11 వరకు 400 కిలోమీటర్లు ఈ సైకిల్‌ యాత్ర జరుగుతుందన్నారు. ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లకు బకాయిలు ఉన్న మెస్‌, డైట్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ కళాశాలలో 117 జీవో రద్దుచేసి పాఠశాల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. అలాగే ప్రతి గ్రామంలో ఒకటి నుండి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న అమ్మఒడి, వసతి, విద్యా దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలని. జిల్లాలో పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్ల సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, బాలికల హాస్టళ్లలో శానిటరీ వాస్కిల్‌ ఉచితంగా ఇవ్వాలని కోరారు. పాచిపెంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, సాలూరు పోస్టుమెట్రిక్‌ కాలేజీ బార్సు హాస్టల్‌కు రోడ్డు సౌకర్యం కల్పించాలని, మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాల నిర్మించాలని, మక్కువలో పోస్టుమట్రిక్‌ హాస్టళ్లు నిర్మించాలని, సీతానగరంలో పోస్ట్‌ మేట్రిక్‌ హాస్టల్‌ను నిర్మించాలని, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాలకొండలో గిరిజన పోస్ట్‌ మెట్రిక్‌ కాలేజీ బాలుర హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలని, నియోజకవర్గ కేంద్రంలో పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, సీతంపేటలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేస్తోంది. గుమ్మలక్ష్మిపురం పోస్టుమేట్రిక్‌ హాస్టలుకు అదనపు భవనం ఏర్పాటు చేయాలని, కురుపాంలో సొంత భవనం ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పార్వతీపురం గిరిజన పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌కు అదనపు భవనాలు నిర్మించాలని, ఎస్‌సి, బిసి పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని, మెడికల్‌ కళాశాల పనులు ప్రారంభించాలని, ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో క్రీడ మైదానాలు ఏర్పాటు చేసి, క్రీడలను ప్రోత్సహిం చాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కరరావు, రాజు, సహాయ కార్యదర్శి సింహాచలం పాల్గొన్నారు. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, చింత పోల్రాజు, మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు పాల్గొన్నారు.