Sep 26,2023 21:41

డిఆర్‌ఒ వెంకటరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విద్యారంగంలో గల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డిఆర్‌ఒ జె.వెంకటరావు కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లకు 8నెలలుగా బకాయిగా నిలిచిన మెస్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో, వసతి గహాల్లో మౌలిక సదుపాయాలు, సొంత భవనాలు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు కాక, సరిపడా పాఠ్యపుస్తకాలు, మెరుగైన విద్య అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. మెరుగైన విద్య అందుబాటుకై జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సాంఘిక సంక్షేమ పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, పాలకొండ గిరిజన పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలని, గరుగుబిల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, సాలూరు కళాశాల బాలుర హాస్టల్‌కు రోడ్డు సౌకర్యం కల్పించాలని, పార్వతీపురంలో గల గిరిజన పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌కు అదనపు భవనాలు నిర్మించాలని, మున్సిపాలిటీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని, గుమలక్ష్మిపురం, సాలూరు బాలురు పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లలో పెండింగులో ఉన్న డ్రైనింగ్‌ హాల్‌ పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లకు ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, డిగ్రీలో మేజర్‌, మైనర్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టళ్లకు ఎఎన్‌ఎంలను నియమించాలని, కార్పొరేట్‌, ప్రేవేట్‌ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు పర్చాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులు నిరంతరం ఎదుర్కొంటున్న ఈ స్థానిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేనిచో భవిష్యతులో పెద్ద ఎత్తు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాజు, బి.గంగారావు, ఉపాధ్యక్షులు సిహెచ్‌ సింహాచలం, కె.భాస్కర్‌ పాల్గొన్నారు.