Aug 03,2023 19:56

సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయికి వినతిపత్రం అందిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం చేపడుతున్న మహాపాదయాత్రలో జిల్లాలోని విద్యారంగ సమస్యలను ప్రస్తావించాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. గురువారం యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప మాట్లాడారు. జాతీయ నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని తెలిపారు. ఫలితంగా జిల్లాలో 418 ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను దగ్గరలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో 418 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 1, 2వ తరగతులు మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చడానికి ఇష్టపడడం లేదని తెలిపారు. 1 నుంచి 5వ తరగతులు ఉండే ప్రయివేట్‌ పాఠశాలలోనే పిల్లలను చేర్చుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల గురించి చరిత్ర పుస్తకాల్లో చదివే రోజులు రాబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని కోరారు. జిల్లా కార్యదర్శులు దావీదు, నరసింహులు, నాయకులు హనుమంతు, రాఘవేంద్ర, బాబు, మాదన్న, భీమేష్‌, రామాంజనేయులు, అల్లాబకాష్‌, సుధాకర్‌, రవికుమార్‌, నాగరాజు పాల్గొన్నారు.