ప్రజాశక్తి:- చిలమత్తూరు : స్వచ్చ భారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ కార్మిక సంఘం, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం ప్రజ ఆరోగ్యాన్ని కాపాడుతూ సేవలు అందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు దాదాపు 9 నెలలు నుండి 18 నెలలు దాకా వేతనాలు అందలేదన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి కుటుంబాల పోషణ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తూ కార్మికులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. తక్షణమే కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బిక్షాటన చేయగా వచ్చిన నగదుతో కార్మికులకు సోపు, నూనె కొనుగోలు చేసి సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వెంకటేష్, లక్ష్మీనారాయణ, రామచంద్ర, గంగాధర్ , ఆటో బాబా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, స్వచ్ఛభారత్ కార్మికులు ఆదినారాయణ, నరసింహప్ప, ఆదిమూర్తి, గంగమ్మ, నారాయణక్క, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










