వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి
స్థాయీసంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, ముందస్తుగా చెరువులను నింపుకోవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, సభ్యులు ఆమోదించారు. విద్య, వైద్య ఆరోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి, జాతీయ ఉపాధిహామీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్. సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, పశుసంవర్ధకం. స్త్రీ శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలను వివరించారు. తమ ప్రాంతాల్లోని సమస్యలను జెడ్పీటీసీ సభ్యులు లేవనెత్తారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప్పాల హారిక మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరారు. రానున్న వేసవిని దష్టిలో పెట్టుకొని స్టోరేజ్ ట్యాంకులను ముందస్తుగా నింపుకోవాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనీ, జగనన్న లేఅవుట్లకు నీటి సరఫరా చేయాలన్నారు. గ్రామదర్శినిపై స్థానిక జడ్పీటీసీ సభ్యులకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని సభ్యులు ప్రస్తావించగా, తెలియపరచడం ద్వారా స్థానిక సమస్యలను తెలియజేయడానికి ఆస్కారం ఉంటుందని గన్నవరం, కంకిపాడు జడ్పీటీసీ సభ్యులు చైర్ పర్సన్‌ను కోరారు. అధికారుల ద్వారా సమాచారం అందిస్తామని ఉప్పాల హారిక హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జి. శ్రీనివాసరావు, వైస్ చైర్ పర్సన్లు గరికపాటి శ్రీదేవి, గుడిమళ్ల కష్ణంరాజు, జెజడ్పీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ బడ్జెట్ రూ.175.88 కోట్లు
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.175.88 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. 1995, 1998 ప్రభుత్వ ఉత్తర్వుల నెం.15, 438 నిబంధనలు అనుసరించి ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత ఫార్మెట్లో బడ్జెట్ అంచనాలు తయారు చేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ ప్రవేశ పెట్టిన జిల్లాపరిషత్ 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ అంచనా రూ.175.88 కోట్లు కాగా, ఆదాయపు అంచనా రూ.354.25 కోట్లు ఖర్చు సవరణ అంచనా రూ.1389.24 కోట్లు, మిగులు అంచనా రూ.140.88 కోట్లుగా చూపించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరపు ప్రారంభ నిల్వ రూ.165.51 కోట్లు కాగా, ఆదాయపు సవరణ అంచనా. రూ.665.35 కోట్లు, ఖర్చు సవరణ అంచనా రూ.654.98 కోట్లు, మిగులు అంచనా రూ.175.88 కోట్లుగా చూపించారు.










