పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రీసర్వే ప్రక్రియ, ఎఫ్‌ఒఎల్‌ఆర్, మ్యుటేషన్స్, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలపై తహసీల్దార్లు, మండల, విలేజ్ సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వేలో భాగంగా రెండవ విడతలో ఎంపిక చేసిన 128 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ప్రక్రియను ఎంపిక చేసిన సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్, విలేజ్ సర్వేయర్ డేటా ఎంట్రీ, వెక్టోరైజేషన్, గ్రౌండ్ వ్యాలిడేషన్, డిఎల్‌ఆర్ ప్రక్రియ, 13వ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఫైనల్ ఆర్‌ఒఆర్ ప్రక్రియలను సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ తర్వాత వెట్రైజేషన్ వేగంగా చేపట్టాలని, డిఎల్‌ఆర్ (డ్రాప్ ల్యాండ్ రిజిస్టర్)ను కూడా త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో జూన్, జూలై నెలలకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో తప్పకుండా చేరుకోవాలని, ఈ విషయమై తహశీల్దార్లు, మండల, విలేజ్ సర్వేయర్లు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. నిర్ధేశించిన సమయంలోపు రీ సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి విడతలో భాగంగా రీసర్వే పూర్తయిన మూడు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, ఆయా గ్రామాల్లో సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్స్ దరఖాస్తులను ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ కొండయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామకష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కష్ణకుమారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బాలాజీ పాల్గొన్నారు.










