May 12,2023 23:14

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

        అమరాపురం, రొద్దం : నాడు-నేడు పనులను మరింత వేగవంతం చేసి, జూన్‌ మొదటి వారం లోపు అన్ని పనులనూ పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అమరాపురం మండలంలో పెనుగొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌తో కలసి పర్యటించారు. తమ్మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. నాడు-నేడు పనులపై నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అంతకుమునుపు తహశీల్దార్‌ కార్యాలయంలో సుస్థిరాభివద్ధి లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీని వెంటనే చేపట్టాలన్నారు. రీసర్వే చేపట్టిన గ్రామాల్లో వచ్చే ఆదివారంలోపు స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు మనబడి నాడు-నేడుకు సంబంధించి మండల స్థాయిలో జరుగుతున్న పనులకు ఎంపిడివోలు బాధ్యులని, పనులు జరుగుతున్న చోటా ప్రతిరోజు ఒక పాఠశాలను తనిఖీ చేయాలన్నారు. మేజర్‌ అండ్‌ మైనర్‌ మరమ్మతులు, మరుగుదొడ్లు, వంట గదిని పూర్తి చేయాలన్నారు. జగనన్న విద్యా కానుక స్టాక్‌ పాయింట్లను పరిశీలించాలని, స్టాక్‌ ఎంత వచ్చింది తనిఖీ చేయాలన్నారు. పాఠశాలల పున్ణప్రారంభం రోజే జగనన్న విద్యా కానుక కిట్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. గహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ కరుణాకర్‌, ఎంపీడీవో మునస్వామి, గహ నిర్మాణ అధికారి గణేష్‌, ఎంఇఒ సత్యనారాయణ, పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి
అమరాపురం నుంచి కర్ణాటక సరిహద్దుకు రోడ్డు పనులను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఎంపీపీ ఈరన్న, జెడ్పీటీసీ స్వర్ణక్క నరసింహమూర్తి, ఎంపిటిసిలు నారాయణ గౌడ్‌, హనుమంతరాయ, సింగల్‌విందో అధ్యక్షులు చిక్కన్న, ఎంపీటీసీ హనుమంతరాయ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అమరాపురం మీదుగా కర్నాటక సరిహద్దును కలిపే రోడ్డు పనులను పూర్తి చేయించాలని కోరారు.

రొద్దంలో కలెక్టర్‌ పర్యటన
          రొద్దం :కలెక్టర్‌ అరుణ్‌ బాబు మండల కేంద్రంలో పలు కార్యాలయాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంపిడిఒ కార్యాలయంలో చెట్ల కింద చెత్తాచెదారం ఎక్కువగా ఉండటంతో శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపిపి రొద్దం పెద్దచెరువు మరువ పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లారు. మరువను మరమ్మతులు చేపట్టాలని ఆయనకు విన్నవించారు. కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు జరుగుతున్న ప్రత్యేక తరగతులను కలెక్టర్‌ పరిశీలించారు. కష్టపడి చదివి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో భోజనశాలను పరిశీలించారు. అక్కడ గదులు చాలా సుందరంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయంటూ ఎస్‌ఒ నాగరత్నమ్మను అభినందించారు. అనంతరం రొద్దం హైస్కూల్‌లో విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉంచిన పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాబర్ట్‌ విల్సన్‌, తహశీల్దార్‌ అనంతాచారి, కేజీబీవీ ఎస్‌ఒ నాగరత్నమ్మ, ఎంఇఒ ఆంజనేయులు నాయక్‌, ఏపీవో జగదీష్‌, ఎంపీపీ చంద్రశేఖర్‌, బి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు.