ధర్మవరం టౌన్ : జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ధర్మవరం పట్టణ సమీపంలోని పోతులనాగేపల్లి లేఅవుట్‌ను బుధవారం సాయంత్రం పరిశీలించారు. జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు ఏఏ దశలో ఉన్నాయో హౌసింగ్ డీఈ మునీశ్వర్‌నాయుడు, ఏఈ బాలాజీలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. ఆర్‌ఎల్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లు సకాలంలో నిర్మాణం జరిగేలా నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. లేఅవుట్‌లలో అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాత్కాలికంగా నీటి సరఫరా ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ శాశ్వతంగా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకునేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్లు పూర్తి కాగా కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఇక్కడ వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకుమునుపు ధర్మవరంలోని మార్కెట్లోని పౌరసరఫరాల సంస్థ గోదామును తనిఖీచేశారు. గోదాములో స్టాకు ఎంత ఉంది.? గోదాములో మరమ్మతు తదితర అంశాలపై ఆరాతీశారు. ఇక్కడ ఈవీఎంలు భద్రపరిచేందుకు వీలుకలుగుతుందా.? లేదా.? అన్నవాటిపై కూడా ఆర్డీవో, తహశీల్దార్లతో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో తిప్పేనాయక్, తహశీల్దార్ యోగేశ్వరిదేవి, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ భవానీశంకర్, హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డీఈ మునీశ్వర్‌నాయుడు, ఏఈ బాలాజీ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్ ఏఈ మూర్తి, సెక్రటరీ రంగనాథ్‌లు ఉన్నారు.










