అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో వేగవంతంగా ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను కొనసాగిస్తున్నల్లు కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నాడు రాబోయే పంటలకు నీటి లభ్యత, రెవెన్యూ, రీసర్వే, జాతీయ రహదారులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్ జైన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ పరిధిలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపడుతున్నామన్నారు. త్వరలో చేపట్టబోయే గహ ప్రవేశాలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఉపాధి హామీ కింద అమలు చేస్తున్న సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, బిటి రోడ్లు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం, ఇతర అన్ని రకాల పనులపై సమీక్ష నిర్వహించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సిపిఒ ప్రశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










