పుట్టపర్తి అర్బన్ : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న గృహ నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగవంతంగా పనులను పూర్తి చేయించాలని హౌసింగ్ చీఫ్ సెక్రటరీ అజరు జైన్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న గహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ పి.అరుణ్‌బాబుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లనిర్మాణంలో హౌసింగ్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. హౌసింగ్ కింద కావాల్సినంత డబ్బు ఉందన్నారు. మెటీరియల్ అంతా అందుబాటులో ఉందన్నారు. లేఔట్లలో మౌలిక వసతులు కల్పన జరుగుతోంది, అన్ని రకాలుగా అనుకూల పరిస్థితి ఉన్నా, ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఎందుకు తక్కువగా ఉందని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సాకులూ చెప్పడానికి వీలులేదన్నారు. ఎక్కువ ఇళ్లు ఇంకా పునాదులు కూడా పడని పరిస్థితుల్లో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పని చేయని వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి ఇల్లు ఎందుకు కట్టలేదు అనేది అడగాలన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన స్థలంలో ఇల్లు కట్టలేదు అంటే వారి స్థలంతో పాటు, ఇల్లు కూడా రద్దు అవుతుందన్న విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి, వారంలో ఒకరోజు తనిఖీలు చేయిస్తామన్నారు. ఒక్కో డివిజన్‌కి ఒక సీనియర్ అధికారిని నియమించి ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలే చూడాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డిఆర్‌ఓ, జిల్లా అధికారులు ఇళ్ల నిర్మాణంపై నిత్యం మానిటర్ చేయాలన్నారు. జిల్లాలోని చిలమత్తూరు మండలానికి సంబంధించి 1,271 ఇల్లు మంజూరు కాక ఇప్పటివరకు 542 ఇల్లు పూర్తి చేసి 85 శాతం పురోగతి సాధించి బాగా పనిచేసిన ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అభినందించారు. ఓడి చెరువు మండలంలో 3,566 ఇల్లు మంజూరు కాగా, 10 శాతం మాత్రమే పురోగతి చూపించారని, పురోగతి చాలా తక్కువగా ఉందని, ఇది ఎంత మాత్రం తగదని, వెంటనే మెరుగుపరచుకోవాలన్నారు. కదిరి అర్బన్‌లో కూడా తక్కువ పురోగతి ఉందని, ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపించాలన్నారు. కలెక్టర్ పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ ఇకపై మండలాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి లేఅవుట్ వారీగా సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా నెలకొకసారి డివిజన్లో పర్యటిస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పేనాయక్, రాఘవేంద్ర, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్‌తో పాటు వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.










