Oct 30,2023 00:16

వేగుచుక్క 'వేమన'

వేగుచుక్క 'వేమన'
విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం
'పద్యానికి పట్టాభిషేక' ర్యాలీ
'సమతా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ
విద్యార్థులకు బహుమతులు ప్రదానం
అలరించిన నృత్యరూపకం

ప్రజాశక్తి - తిరుపతి
'ఒక సూర్యబింబం... ఒక దీపస్తంభం.. ఒక జ్ఞానసంద్రం..ఒక ధైర్యశిఖరం ...వేమన్న పద్యం...వేనోళ్ల వాదం..' అంటూ వేగుచుక్క.. వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతి నగర నడిబొడ్డున యశోదానగర్‌లో వందలాది మేధావులు, కవులు, రచయితలు, విద్యార్థుల మధ్య ఉత్సాహపూరిత వాతావరణంలో, స్ఫూర్తిదాయకంగా ఆదివారం ప్రారంభమయ్యింది.. తొలుత టిటిడి పరిపాలనా భవనం నుంచి 'వేమన పద్యాలకు పట్టాభిషేకం' అంటూ పద్యాలాపన చేస్తూ వేమన విజ్ఞాన కేంద్రం వరకూ ర్యాలీ సాగింది. ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి, మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం ప్రారంభించారు. పలవలి రామకృష్ణారెడ్డి సమావేశ మందిరాన్ని ఆయన కుమార్తె పలవలి కుసుమకుమారి, ఎజి యతిరాజులు సమావేశ మందిరాన్ని ఆయన భార్య ఎజి చంద్రమ్మ ప్రారంభించారు. వేమన పద్య చిత్రలేఖన ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. బాలభవన్‌ విద్యార్థులు ప్రదర్శించిన వేమన పద్య నృత్య రూపకం సభికులను ఆలోచింపజేసింది. సభకు బాలోత్సవ గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షత వహిస్తూ వేమన పద్యం ప్రాముఖ్యతను వివరించారు. వర్షానికి తడవనివారు, వేమన పద్యాలు ఒకట్రెండైనా రానివారు ఎవరూ ఉండరన్నారు.
కాలానికంటే ముందు నడిచిన వ్యక్తి వేమన
: తెలకపల్లి, విఠపు
తెలకపల్లి రవి, విఠపు బాలసుబ్రమణ్యం సభను ఉద్దేశించి మాట్లాడుతూ వేమన అప్పట్లోనే కాలానికంటే ముందు నడిచిన వ్యక్తని, నేటికీ కాలంతో పాటు నడుస్తున్న వ్యక్తని కొనియాడారు. వేయి తలపులు సంఘర్షిస్తూ ప్రశ్నించేవారికి విజ్ఞాన కేంద్రం కేంద్రమవ్వాలన్నారు. ఆంధ్రులంటే ఆరంభశూరులనే తేలిక భావం జనంలో ఉందని కానీ ఆనాడే వేమన 'పట్టుబట్టరాదు..పట్టి విడువరాదు.. పట్టినేని బిగియ పట్టవలయు.. పట్టి విడుచుటకన్నా పడి చచ్చుట మేలు' అని విచక్షణతో సరైన మార్గం ఎంచుకోవాలని సూచించారు. సమాజానికి హేతబద్ద ప్రశ్నలను నేర్పించిన మహాకవి వేమన సూచించిన మార్గంలో భవిష్యత్‌ తరాలు నడవాలన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ప్రశ్నించిన ఎవరికైనా ప్రజలంతా అండగా నిలవాలని, ఇటీవల అరెస్టయిన న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు సందర్భంగా అలా జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఆధునిక కవిత్రయం అంటే వేమన, గురజాడ, శ్రీశ్రీ అని ఉద్ఘాటించారు. వారి భాషలోనూ, భావాల్లోనూ విప్లవాత్మక సందేశం ఉందన్నారు. నాటికీ నేటికీ వేమన పద్యాలు కాలానుగుణంగా ప్రాచుర్యం పొందుతూనే ఉన్నాయన్నారు.
సమాజ గమన సూత్రాలు చెప్పారు
: ఆచార్య కుసుమ కుమారి
నేటి సమాజ గమన సూత్రాలను ఆనాడే తన పద్యాల రూపంలో తెలియజేసిన మహాకవి వేమన అని మాజీ వీసీ ఆచార్య కుసుమకుమారి అన్నారు. తన తండ్రి పేరుతో సమావేశ మందిరాన్ని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమను తమ తండ్రి పలవలి రామకృష్ణారెడ్డి భౌతికవాద దృక్పధంతోనే పెంచారని గుర్తు చేశారు. త్వరలోనే ప్రారంభించబోయే గ్రంథాలయానికి తనవంతు సాయంగా రూ.50వేలు ఇస్తున్నట్లు సభావేదికపైనే ప్రకటించారు.
రైతుగా ఉండటమే ఇష్టం
: డాక్టర్‌ లింగుట్ల రమేష్‌నాథ్‌
తనకు డాక్టర్‌గా కంటే భూమిబిడ్డగా, రైతుగా ఉండటమే ఇష్టమని డాక్టర్‌ లింగుట్ల రమేష్‌నాథ్‌ అన్నారు. సమాజ సేవలో వేమన విజ్ఞాన కేంద్రం ఇప్పటికే చేస్తున్న కృషిని అభినందించారు. తనవంతు సాయం ఎపుడూ ఈ కేంద్రానికి ఉంటుందని చెప్పారు. ఈ కాలపు వికృత పోకడలను ఆనాడే గుర్తించి నిజాన్ని నిక్కచ్చిగా జనానికి వల్లెవేసిన వేమన ఆశయ సాధన కోసం తిరుపతివాసులంతా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కేంద్రంగా ఈవిజ్ఞాన కేంద్రం ఉండాలన్నారు.
వేమన దివిటిని భవిష్యత్‌ తరాలకు
: కొలకలూరి మధుజ్యోతి
వేమన అందించిన స్ఫూర్తిదాయకమైన పద్యాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఓ యజ్ఞంలా విజ్ఞాన కేంద్రం పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ రచయిత్రి కొలకలూరి మధుజ్యోతి అన్నారు. సమాజంలోని రుగ్మతలపై వేగుచుక్కలా వేమన పద్యాల ప్రభావం ఎప్పటికీ ఉంటుందన్నారు. వేమనను విశ్వకవిగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు.
తిరుపతివాసుల్లో ఐక్యత ఉంది
: కెవి చౌదరి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షులు
తిరుపతి వాసుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అనాదిగా ఐక్యత ఉంది. వారందరి సహకారంతో బాలోత్సవం విజయవంతమయ్యింది. భవిష్యత్‌ తరాల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ఛాంబరాఫ్‌ కామర్స్‌ సహకారం ఎపుడూ ఉంటుంది.
వాస్తవాలకు విరుద్దంగా సోషల్‌ మీడియా : ఎజి అరవింద్‌
వాస్తవాలకు విరుద్ధంగా సోషల్‌ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువగా ప్రచారం జరుగుతోందని, కులం మతం, ప్రాంతీయ భావాలతో మనుష్యుల దూరం పెరుగుతోందని ప్రముఖ అనువాదకులు ఎజి యతిరాజులు కుమారుడు ఎజి అరవింద్‌ అన్నారు. ఈ రుగ్మతలు పోవాలంటే నేటి తరానికి వేమన సాహిత్యం అవసరమని అన్నారు. విజ్ఞాన కేంద్రంలో తన తండ్రి పేరుతో సభామందిరం ఏర్పాటు చేయడం మరచిపోలేని జ్ఞాపకంగా మిగులుతుందన్నారు.
కార్యక్రమంలో రాయలసీమ సాహితీవేత్త భూమన్‌, ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్‌ పిసి వెంకటేశ్వర్లు, కస్తూరిబా గాంధీ ట్రస్టు అధ్యక్షులు పిసి రాయల్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తిరుపతి అధ్యక్షులు మోహన్‌ కుమార్‌ రాజు, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు రాజ్‌కుమార్‌, రాయలసీమ మిమిక్రీ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు విజరుకుమార్‌, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథరెడ్డి, రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ శ్రీనివాస నెహ్రూ, హంస అవార్డు గ్రహీత యండపల్లి భారతి, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పల్లెపట్టు నాగరాజు, అభినవ వేమన పత్తిపాటి రమేష్‌నాయుడు, ఆఫీసర్స్‌ క్లబ్‌ అధ్యక్షులు తమటం రామచంద్రారెడ్డి, శిల్ప కళాశాల కళాకారుడు డాక్టర్‌ సాగర్‌ గిన్నె, విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ, రెడ్డెప్ప, సుంకర రెడ్డెప్ప, సాయిలక్ష్మి, అవనిగడ్డ పద్మజ, గురునాధం, పసల మునిరామయ్య ఉన్నారు.
వేమన విజ్ఞాన కేంద్రం ఈనాటి అవసరం
: ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి
మన సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తున్నా, చాలా విషయాల్లో మధ్యయుగ అవశేషాల నుంచి బయటపడలేకపోతున్నది. వేమన వీరబ్రహ్మంలు సామాజిక రుగ్మతలను ఆనాడే విమర్శించారు. అవి యధాతధంగానే రూపం మార్చుకొని ఇంకా కొనసాగుతున్నది. నిజానికి అవి ఇప్పుడు కార్పొరేట్‌ రూపం తీసుకున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ఇకపోతే మన సమాజం మానవీయ గుణాన్ని నిలుపుకోజాలదు. ఆధునిక సమాజం అనిపించుకోదు. అందుకే వేమన విజ్ఞాన కేంద్రం ఈనాటి అవసరం. ఈదష్టితోనే విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందని నమ్ముతున్నాను. అనారోగ్య కారణం వల్ల ప్రారంభోత్సవానికి రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలకపల్లి రవి, విఠపు బాలసుబ్రమణ్యం, ఆచార్య కుసుమ కుమారి ఇతర అతిథులకు 'సమతా షాప్నికుడు వేమన 'సంచిక రూపకల్పనలో భాగస్వాములైన సంపాదకవర్గం, వ్యాసకర్తలకు నా హదయపూర్వక శుభాకాంక్షలు.