ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో భూముల రీ సర్వే రెండో దశ పనులు వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.గురువారం మధ్యాహ్నం మంగళగిరి సీసీఎల్‌ఏ కార్యాలయం నుండి సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థ జైన్, అదనపు సీసీఎల్‌ఏ ఇంతియాజ్ అహ్మద్ జిల్లా కలెక్టర్లతో భూముల రీ సర్వే, అసైన్మెంట్లు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో దశలో చేపట్టిన భూముల రిసర్వే కార్యక్రమంలో 62 గ్రామాలకు గాను ఇప్పటివరకు 38 గ్రామాల్లో పూర్తయిందని మిగిలిన 24 గ్రామాల్లో ఈ నెలలోగా రీ సర్వే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రీ సర్వే 24 గ్రామాలకు సంబంధించి సెక్షన్ 13 నోటిఫికేషన్లు కూడా ఈ నెలాఖరులోగా జారీ చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20 గ్రామాల్లో సరిహద్దు రాళ్లు నాటారని, మిగిలిన 42 గ్రామాల్లో వచ్చే సెప్టెంబర్ మాసం లోగా పూర్తి చేస్తామన్నారు. అసైన్మెంట్ భూములకు సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులతో చర్చిస్తామని, రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే లంక భూములకు సంబంధించి కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని అసైన్మెంట్ పూర్తి చేస్తామన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి డిఆర్‌ఓ. ఎం. వెంకటేశ్వర్లు సర్వే భూ రికార్డుల ఏడి గండికోట రంగారావు పాల్గొన్నారు.










