Oct 07,2023 17:38

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు ప్రాంత ప్రజల కోసం వేదవతి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించి, నిర్మాణం పూర్తి చేయాలని ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో నిట్రవట్టి నుంచి ఆలూరు వరకు జరిగే రైతు పాదయాత్రను జయప్రదం చేయాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు కోరారు. శనివారం జ్యోతిబసు భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గం శాశ్వత కరువు నివారణ కోసం వేదవతి ప్రాజెక్ట్‌ పనులు వెంటనే ప్రారంభించి, నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూములు ఎక్కువగా కోల్పోతున్న బిలేహాళ్‌ రైతులకు భూమికి భూమి ఇచ్చి, ఐదు సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జింకల పార్కు ఏర్పాటు చేసి పంటలను కాపాడాలని కోరారు. ఆలూరు చెరువును ఎస్‌ఎస్‌ ట్యాంకుగా మార్చి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, ప్రజలు, యువతను చైతన్య పరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుసంఘం ఆధ్వర్యంలో ఈనెల 9, 10, 11న పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు నిట్రవట్టి, బిలేహాళ్‌, దేవరగట్టు, కొత్తపేట, నెరణికి తండా (రాత్రిబస), రెండో రోజు కరిడిగుడం, హులేబీడు, తుంబలబీడు, పెద్దహోతూరు (రాత్రి బస), మూడో రోజు పెద్దహోతూరు గ్రామం నుంచి ఆలూరుకు చేరుకొని రైతులతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి, రైతుసంఘం మండల కార్యదర్శి ఈరన్న, కృష్ణ, షాకీర్‌, మైనా, గోవర్ధన్‌ పాల్గొన్నారు.